తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు రాజమౌళి. ఆయన కెరీర్‌ మొత్తాన్ని పరిశీలిస్తే ప్రతి సినిమా ముందున్నదానికంటే ఒక మెట్టుపైకి తీసుకెళ్లింది. ‘మగధీర’తో తెలుగు సినిమా టెక్నికల్ రేంజ్‌ పెరిగింది. ఆ తర్వాత వచ్చిన ‘ ఈగ ’, ‘ బాహుబలి ’ సినిమాలతో భారతీయ సినిమా స్థాయి కొత్త శిఖరాలు చేరింది. రాజమౌళి సృజనాత్మక దృష్టి, కష్టపడి సాధించే ధైర్యం, టీమ్‌పై ఉన్న నమ్మకం ఇవే ఆయన విజయానికి మూలాధారం. ‘బాహుబలి’ సినిమా మొదలైన సమయంలో తెలుగు సినిమా బడ్జెట్ పరిమితంగా ఉండేది. అప్పటి ఇండస్ట్రీ హిట్ అయిన ‘మగధీర’ రూ.80 కోట్ల షేర్‌ సాధించగా, దానిపై మరో రూ.40 కోట్లు ఎక్కువ పెట్టి, సుమారు రూ.120 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘బాహుబలి’ ప్రాజెక్ట్‌ ప్రారంభమైంది. ఇది అప్పుడు ఎవరికీ ఊహించని రిస్క్‌.


రాజమౌళి మాత్రం సినిమా మీద విశ్వాసంతో ముందుకు సాగాడు. షూటింగ్‌ కొనసాగుతుండగా సినిమా రెండు భాగాలుగా మార్చారు. దాంతో బడ్జెట్‌ కూడా రెట్టింపు అయి సుమారు రూ.250 కోట్ల దాకా పెరిగింది. సినిమా రిలీజ్‌ ముందు రోజు అర్ధరాత్రి ప్రీమియర్స్‌ షోలు వేశారు. కానీ మొదటి షో తర్వాత సోషల్ మీడియాలో డివైడ్‌ టాక్‌ రావడంతో రాజమౌళి టీమ్‌ అంతా తీవ్ర టెన్షన్‌కు గురయ్యారట‌. అప్పుడు సినీ స‌ర్కిల్స్‌కు చెందిన వాట్సాప్ గ్రూపుల్లోనే నెగ‌టివ్ టాక్ వ‌చ్చింద‌ట తొలిరోజు. దీంతో రాజ‌మౌళి ప‌డిన బాధ అంతా ఇంతా కాద‌ట‌. ముఖ్యంగా ప్రభాస్, రానా, నిర్మాత శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్‌లకు ఆందోళన ఎక్కువగా కనిపించింద‌ట‌. రాజమౌళి చెప్పినట్టు, ఆ సమయానికి నిర్మాతలు సుమారు రూ.40 కోట్ల డెఫిషిట్‌లో ఉన్నారు. “ మనం తీసింది చెడ్డ సినిమా కాదు , ఆడియెన్స్‌కి నచ్చుతుందనే నమ్మకం ఉంది ” అని రాజమౌళి అప్పటి భావోద్వేగాన్ని తాజాగా గుర్తు చేసుకున్నారు.


తర్వాత డిస్ట్రిబ్యూటర్ కొర్ర‌పాటి సాయిని కలిసి పరిస్థితి తెలుసుకున్నారు. మొదట కాస్త ఆందోళన ఉన్నా, రెండవ రోజు నుంచే కలెక్షన్లు ఊహించని స్థాయికి చేరాయి. ప్రతీ షోకు హౌస్‌ఫుల్‌, ప్రతి థియేటర్‌లో “జై బాహుబలి” నినాదాలు వినిపించాయి. మొదటి వారం తర్వాతే సినిమా బ్రేక్‌ ఈవెన్‌ చేరి రికార్డులు బద్దలుకొట్టడం మొదలుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ‘బాహుబలి’ ఫెనామినన్‌ సృష్టించింది. ఇప్పుడు ‘బాహుబలి: ది ఎపిక్’ రీ–రిలీజ్ సందర్భంగా రాజమౌళి, ప్రభాస్, రానాలు ఆ జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆ కష్టకాలం, ఆ భయం, ఆ నమ్మకం ఇవన్నీ బాహుబ‌లిని ప్ర‌పంచ వ్యాప్తంగా నిలిపాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: