ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది పరిస్థితి. మాటల యుద్ధం తారాస్థాయిలో ఉంది. ఏ పని చేసినా సరే... అందులో రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి కూడా. ప్రస్తుతం విజయవాడ కేంద్రంగా జరుగుతున్న పనులు కూడా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆధిపత్య పోరును తలపిస్తున్నాయి. విజయవాడలో కొత్తగా నిర్మించిన బెంజ్ సర్కిల్ రెండో ఫ్లై ఓవర్ వ్యవహారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు కోల్‌కతా - చెన్నై 16వ నంబర్ జాతీయ రహదారిపై కేంద్రం ఫ్లై ఓవర్ నిర్మించింది. 2019 అక్టోబర్ నెలలో మొదటి ఫ్లై ఓవర్ ప్రారంభించగా... ఇప్పుడు రెండో ఫ్లై ఓవర్ ను కూడా ప్రారంభానికి సిద్ధమైంది. ఇప్పుడు ఇదే పై వంతెన క్రెడిట్ మాదంటే మాదంటున్నారు రెండు పార్టీల నేతలు.

విజయవాడ వాసుల దశాబ్దాల కల బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్. బెంజ్ సర్కీల్ వద్ద నిత్యం ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం. ప్రతిసారి ఎన్నికల సమయంలో వీటికి మంగళం పాడతామంటూ ఎప్పటి నుంచో ఎన్నికల హామీలు ఇస్తున్నారు. కానీ వాటిపై తీవ్రంగా కసరత్తు చేసింది మాత్రం 2014లో తొలిసారి ఎన్నికైన ఎంపీ కేశినేని నాని. విజయవాడలో ప్రధానంగా దుర్గ గుడి ఫ్లై ఓవర్‌, బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్, బందర్ రోడ్డు విస్తరణపైనే కేశినేని నాని కేంద్రంతో చర్చలు జరిపారు. వీటికి నితిన్ గడ్కరీ అంగీకారం తెలిపారు. అన్నట్లుగానే ముందుగా ఫస్ట్ ఫ్లై ఓవర్, దుర్గ గుడి ఫ్లై ఓవర్ పనులు ప్రారంభమయ్యాయి. కానీ వాటి ప్రారంభం మాత్రం 2019 అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ హయాంలోనే జరిగింది. దీంతో మా వల్లే పనులు ప్రారంభమయ్యాయన్నారు వైసీపీ నేతలు. ఇక ఇప్పుడు రెండో ఫ్లై ఓవర్ విషయంలో కూడా సేమ్ సీన్ రిపిట్ అవుతోంది. మా హయాం కాబట్టే త్వరగా పూర్తయ్యిందని వైసీపీ నేతలు అంటుంటే.... నేను కేంద్ర మంత్రితో స్వయంగా మాట్లాడటం వల్లే గడువు కంటే ముందే పనులు పూర్తయ్యాయంటున్నారు ఎంపీ కేశినేని నాని. అసలు కేంద్ర ప్రభుత్వం వల్లే ఈ నిర్మాణం జరిగిందంటున్నారు బీజేపీ నేతలు. కేంద్రమే నిధులు కేటాయించినట్లు ప్రకటిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: