సీఎం అల్లుడు, మాజీ సీఎం కొడుకూ "చేతు"లు కలిపారా..!?
మనదేశలో ఎన్నికలను మించిన పండుగ ఇంకేముంటుంది. ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టే మన ఎన్నికలు.. ఎన్నిలోపాలున్నా.. ఎన్ని అవకతవకలున్నా.. జనం తమ నాయకున్ని తామే ఎన్నుకునే స్వేచ్ఛే ప్రజాస్వామ్యపుష్పానికి అసలైన తావి. మరి అలాంటి ఎన్నికల్లోనూ కుమ్మక్కు రాజకీయాలు చేరితే.. అధికారం కోసం, డబ్బు కోసం అధికారపక్షం, విపక్షం చేతులు కలిపితే.. 

అలాగే జరిగిందని ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ తరపున ముఖ్యమంత్రి అల్లుడు, ప్రతిపక్షం తరపున మాజీ ముఖ్యమంత్రి అల్లుడు చేతులు కలిపారట. పోటాపోటీగా జరగాల్సిన ఉప ఎన్నికను ఏకపక్షం చేసేశారట. ఇంతకీ ఇది జరిగిందెక్కడో చెప్పలేదు కదూ.. మన తెలుగు రాష్ట్రాల్లో కాదులెండి.. మన పొరుగునే ఉన్న చత్తీస్ గడ్ లో.. ఇప్పుడు ఈ కుమ్మక్కుకు సంబంధించిన ఆడియో టేపులు బయటకు వచ్చి పెద్ద రాజకీయ దుమారానికి దారి తీశాయి. 

ఇది ఇప్పుడు జరిగిన ఎన్నిక కాదు. గతేడాది అనంత్‌గఢ్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఆ రాష్ట్ర సీఎం రమణ్‌ సింగ్‌ అల్లుడు పునీత్‌ గుప్తా., ప్రతిపక్షనేత అజిత్‌ జోగి కుమారుడు అమిత్‌ జోగి ఈ ఉప ఎన్నికను ఫిక్సింగ్ చేసేశారట. ఈ మేరకు ఎన్నికల ముందే అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయట. దానికి సంబంధించిన ఆడియో సాక్ష్యాలను ఇటీవల కాంగ్రెస్ పార్టీ సంపాదించింది. 

ఆ ఉపఎన్నికల్లో చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి.. మంతూరామ్‌ పవార్‌ ఆఖరి క్షణంలో పోటీ నుంచి  తప్పించుకున్నాడు. అదేమంటే కుంటి సాకులు చెప్పాడు. అప్పట్లో అది నిజమే అనుకున్నారు. ఇప్పుడీ ఆడియో టేపులు బయటపడిపోయాక అసలు సంగతేంటో అందరికీ అర్థమవుతోంది. ఆయన పోటీ నుంచి తప్పుకునేందుకు అధికార పక్షం డబ్బు ఎరచూపినట్టు ఆడియో టేపులు చెబుతున్నాయి. 

చత్తీస్ గఢ్ లో మంచి పేరున్న సీఎం రమణ్ సింగ్ కు ఈ ఆడియో వివాదం తలవంపులు తెచ్చిపెడుతోంది. ఈ ఫిక్సింగ్ ఎలక్షన్ విషయంలో ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌పై కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరుగుతోంది. రమణ్ సింగ్ తక్షణమే పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తోంది. అధికారపక్షంతో కుమ్మక్కైన అజిత్ జోగికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. అధికార పక్షమైన బీజేపీ మాత్రం దీన్ని కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటగా కొట్టిపారేస్తోంది. ఏది నిజమన్నది విచారణలో కానీ తేలదు.


మరింత సమాచారం తెలుసుకోండి: