కేంద్రంలో అధాకారంలోకి రావటంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మూడు పార్టీలను టార్గెట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.  మూడు రాష్ట్రాల్లో 63 పార్లమెంటు సీట్లు ఉండటమే టార్గెట్ చేయటానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. వీళ్ళని కలిసి ఒప్పించే బాధ్యతను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమలనాధ్ కు సోనియా గాంధి అప్పగించిందనే ప్రచారం కూడా పెరిగిపోతోంది. అంటే మిగిలిన పార్టీలతో మాట్లాడే బాధ్యత వేరే వాళ్ళకు అప్పగించిందట అధిష్టానం.

 

తెలుగురాష్ట్రాల్లోని టిఆర్ఎస్, వైసిపిలతో పాటు ఒడిస్సాలోని బీజూ జనతాదళ్ పార్టీలు ప్రస్తుతం ఏ కూటమిలోను లేరు. వీరిలో ఒడిస్సా సిఎం నవీన్ పట్నాయక్ చాలా కాలంగా తటస్ధంగానే ఉన్నారు. ఇక కెసియార్ అటు ఇటు కుప్పిగంతలు వేసిన సందర్భాలున్నాయి. వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి కేంద్రం స్ధాయిలో మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఇంత వరకూ రాలేదు.

 

కాకపోతే  రేపటి కౌంటింగ్ లో  వైసిపిదే అధికారం అనే ప్రచారం ఊపందుకున్న నేపధ్యంలో ఇటు కాంగ్రెస్ అయినా అటు బిజెపి అయినా జగన్ కు గాలమేస్తున్నాయి. రేపటి ఫలితాల్లో జగన్ కు గనుక ఓ 20 ఎంపి సీట్లు వస్తే చాలు జాతీయ రాజకీయాల్లో జగన్ కేంద్ర బింధువైపోతారు.

 

ఆ విషయాన్ని గుర్తించాయి కాబట్టే జాతీయ పార్టీలు రెండు జగన్ వెంట పడుతున్నాయి. కాకపోతే జగన్ కాస్త తెలివిని ప్రద్రర్శించి ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వటం లేదట. ఫలితాలు వచ్చిన తర్వాతే ఏ విషయాన్ని ఆలోచిస్తానని చెప్పారట. అందుకే జగన్ ను యూపిఏ వైపుకు తీసుకొచ్చే బాధ్యతను సోనియా గాంధి మధ్యప్రదేశ్ సిఎం కమల్ నాథ్ కు అప్పగించిందట.

 

ఇదే విషయమై కమలనాధ్ వైసిపిలోని కీలక నేతకు మాట్లాడినపుడు 23 ఫలితాల తర్వాత మాట్లాడుకుందామని జగన్ మాటగా చెప్పారట. కాబట్టి మే 23వ తేదీ ఫలితాల వైపే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే వైసిపికి వచ్చే సీట్లపైనే జగన్ డిమాండ్ ఆధారపడుంటుంది కాబట్టి.


మరింత సమాచారం తెలుసుకోండి: