ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాన జలవనరయిన శ్రీశైలం డ్యాం ప్రమాదకర స్థితిలో ఉందా? కృష్ణమ్మను నింపుకుని, విద్యుత్ ఉత్పాదన చేస్తూ తెలుగు ప్రజలకు నీరు, వెలుగు ఇస్తున్న శ్రీశైలానికి ప్రమాదం పొంచి ఉందా? డ్యామ్‌కు తక్షణమే మరమ్మత్తులు చేపట్టకపోతే పెను విధ్వంసం తప్పదా..? పదే పదే గేట్లు ఎత్తాల్సిరావడం డ్యామ్ భద్రతకు ముప్పు కలిగిస్తోందా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమిస్తున్నారు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్.  

 

గంగాజల్ సాక్షరత్ యాత్రలో భాగంగా శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించిన రాజేంద్ర సింగ్ డ్యాంకు ఏదయినా విపత్తు సంభవిస్తే సగం ఆంధ్రప్రదేశ్ కనిపించకుండా పోతుందని తీవ్ర హెచ్చరిక చేశారు. డ్యామ్ నిర్వహణకు 600 మంది సిబ్బంది అవసరమనీ, కానీ వందమంది మాత్రమే పనిచేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. తీవ్ర హైడ్రోలిక్ ఒత్తిడి వల్ల నీటి వేగం ఎక్కువగా ఉండి, డ్యాం కోతకు గురయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. 

 

రాజేంద్ర సింగ్ హెచ్చరికలతో శ్రీశైలం డ్యాంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జలాశయం ప్రమాదం అంచున నిలవడానికి కారణం డ్యాం నిర్వహణ సరిగ్గా లేకపోవడమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  885 అడుగులు, 215 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు పన్నెండు రేడియల్ క్రస్ట్ గేట్లు ఉన్నాయి. ఈ గేట్ల నుంచి విడుదలయ్యే నీరు స్పిల్‌ వే ద్వారా దిగువన ఉన్న తొట్టిలోకి చేరి, అక్కడ నుంచి డ్యామ్ పునాదులకు దూరంగా పడుతుంది. డ్యాం ముందు ఇలా నీరు పడే ప్రాంతాన్ని ప్లాంజ్ పూల్ అంటారు. ఇక్కడ భారీ గొయ్యి ఏర్పడింది. 1999, 2009తో పాటు ఈ ఏడాది శ్రీశైలానికి భారీగా కృష్ణమ్మ వరద చేరడంతో అన్ని గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఇలా అన్నిగేట్లు ఎత్తడం వల్లే గొయ్యి ఏర్పడిందని అధికారులు అంటున్నారు. 1999లో అరవై  అడుగులు ఉన్న గొయ్యి 2009లో వంద అడుగులకు పెరిగింది. ఇటీవల వరదలతో ఈ గొయ్యి మరింత పెద్దదయింది.  

 

అలాగే పదే పదే గేట్లు ఎత్తడం వల్ల వాటికి ఉండే రబ్బర్ స్లీవ్స్ అరిగిపోయి, గేట్ల నుంచి నీళ్లు లీకవుతున్నాయి. దీనివల్ల డ్యామ్‌కు పగుళ్లు ఏర్పడుతున్నాయి. గొయ్యి,  వాటర్ లీకేజ్ వల్ల డ్యామ్‌కు ఏమన్నా ప్రమాదం పొంచి ఉందా అనే దానిపై అధికారులు సర్వేలు చేయించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: