నేరేడుచర్ల మున్సిపల్ ఎన్నికలో ట్విస్ట్ ల మీద టిస్ట్ లు కొనసాగాయి. నేరేడుచర్ల మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ పరం అయింది. ఛైర్మన్ గా జయబాబు ఎంపిక కాగా వైస్ ఛైర్మన్ గా శ్రీలతా రెడ్డి ఎంపికయ్యారు. నిన్నటివరకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ బలాబలాలు సమంగా ఉండటంతో నేరేడుచర్ల మున్సిపాలిటీ ఎవరి పరం అవుతుందో అనే ప్రశ్నలు వినిపించాయి. కానీ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డికి ఎక్స్ అఫీషియో ఓటు ఇవ్వడంతో టీఆర్ఎస్ పార్టీ బలం 11 కు చేరింది. 
 
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన నేరేడుచర్ల టీఆర్ఎస్ పార్టీ వశమైంది. కాన్ని ఛైర్మన్ ఎన్నిక జరిగే వరకు నేరేడుచర్లలో వాతావరణం యుద్ధ వాతావరణాన్ని తలపించింది. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి ఎక్స్ అఫీషియో ఓటు కల్పించటంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికను బహిష్కరించింది. ఎన్నికల ప్రక్రియ నిన్నటి జాబితా ప్రకారమే చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కానీ ఈసీ ప్రకటన చేసిన కొత్త జాబితా ప్రకారమే ఎన్నికల ప్రక్రియ చేపడతామని అధికారులు స్పష్టం చేశారు. 
 
ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ ఎన్నికల అక్రమాలకు నేరేడుచర్ల మున్సిపల్ ఎన్నికలే నిదర్శనం అని అన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యుల నమోదు ఈ నెల 25వ తేదీ వరకే జరగాలని నిబంధనలు ఉన్నాయని ఈరోజు నేరేడుచర్ల మున్సిపల్ సభ్యులుగా సుభాష్ రెడ్డి పేరును నమోదు చేయిస్తున్నారని అన్నారు. ఇది అక్రమమని నిబంధనలకు విరుద్ధమని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇక ఎన్నికలు ఎందుకు...? కేటీఆర్ ఇంట్లో కూర్చుని రాసుకుంటే సరిపోతుంది కదా..? అని చెప్పారు. 
 
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డదారిలో టీఆర్ఎస్ పార్టీ ఛైర్మన్ సీటును కైవసం చేసుకుందని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ధర్నాకు దిగటంతో పోలీసులు ఉత్తమ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఛైర్మన్ ఎన్నికకు వ్యతిరేకంగా ఉత్తమ్ తో పాటు కేవీపీ ధర్నాకు దిగడంతో పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికను బహిష్కరించడంతో ఉత్తమా... ఇదేం అస్త్ర సన్యాసమా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: