రాజకీయాల్లో పార్టీలు మారడం సర్వ సాధారణ విషయమే. తమ తమ అవసరాల కోసం నేతలు వలసలు పోతూ ఉంటారు. అయితే అలా పార్టీలు జంప్ చేయడానికి సొంత ప్రయోజనాలే ఎక్కువ ఉన్న...ప్రజల కోసం పార్టీలు మారుతున్నట్లు చెబుతారు. కానీ ఒకప్పుడు పార్టీలు మారితే ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు గానీ, ఈ మధ్య కాలంలో మాత్రం  ప్రజలు యాక్సెప్ట్ చేయడం లేదు. దానికి ఉదాహరణే 2019 ఎన్నికలు. 2014లో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వెళ్ళిన 23 మంది ఎమ్మెల్యేల్లో 22 మందిని ప్రజలు ఓడించారు.

 

దీని బట్టి చూస్తే ప్రజలు పార్టీల మారే వాళ్ళని తేలిగ్గా వదిలే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే ఇదే పరిస్తితి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరికి వస్తుందా? అంటే రాదని చెప్పలేం. 2014లో గుంటూరు ఈస్ట్ నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన గిరి, 2019 ఎన్నికల్లో అదే టీడీపీ నుంచి వెస్ట్ నుంచి పోటీ చేసి గెలిచారు. అయితే టీడీపీ అధికారంలోకి రాకపోవడం, తన పనులు పెండింగ్‌లో పడిపోవడం, నియోజకవర్గానికి నిధులు అందవనే కారణాల చేత గిరి వైసీపీకి మద్ధతు తెలిపారు.

 

జగన్ పాలసీ ప్రకారం అయితే తమ పార్టీలోకి వచ్చేవాళ్లు పదవులుకు రాజీనామా చేసి రావాలి. అయితే అలా కష్టమని భావించి పార్టీలో చేరకుండానే వల్లభనేని వంశీ, మద్దాలి గిరిలు వైసీపీకి మద్ధతు తెలుపుతూ టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలుగా కూర్చున్నారు. కాకపోతే ఇలా పరోక్షంగా మద్ధతు తెలిపిన ప్రజలకు అర్ధం కాకుండా ఉంది. పైగా గుంటూరు వెస్ట్ టీడీపీకి కంచుకోటలా ఉంటుంది. ప్రస్తుతం ఏదో పార్టీ మారినా, నెక్స్ట్ ఎన్నికలకు గిరికీ ఇబ్బందికర పరిస్తితి ఎదురవొచ్చు.

 

అయితే ఇప్పుడు అధికార పార్టీ అండ ఉండటంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు బాగానే చేయించుకోగలుగుతున్నారు. అటు ప్రభుత్వ పథకాలు కూడా ప్రజలకు అందిస్తున్నారు. కాకపోతే రాజధాని విషయంలో కూడా గిరిపై నెగిటివ్ వచ్చే అవకాశముంది. అమరావతి పక్కనే ఉండటంతో గుంటూరు వాసులు మూడు రాజధానులపై నెగిటివ్‌గా ఉన్నారు. ఇక ఈ ప్రభావం గిరిపై బాగా పడే ఛాన్స్ ఉంది. మొత్తానికైతే గుంటూరు వెస్ట్‌లో గిరికి అంత అనుకూల పరిస్థితులు లేవనే చెప్పాలి.                                                                                                                  

మరింత సమాచారం తెలుసుకోండి: