గుజరాత్ మరో మహారాష్ట్రగా మారుతోంది...! ఇంకా చెప్పాలంటే మహారాష్ట్రలో కంటే వేగంగా కరోనా కేసులు గుజరాత్‌లో విస్తరిస్తున్నాయి. వారం రోజుల్లోనే కరోనా కేసులు మూడింతలవడం ఆందోళన కలిగిస్తోంది.

 

కరోనా కేసుల విషయంలో మహారాష్ట్రతో పోటీపడుతోంది గుజరాత్. దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రెండో రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. కొత్తగా 217 కేసులు నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 2,624కు చేరుకుంది. ప్రస్తుతం కరోనాకు చికిత్స పొందుతున్న వారిలో 28 మంది పరిస్థితి విషమంగా ఉంది. వీరందర్నీ వెంటిలేటర్‌పై ఉంచారు. మహారాష్ట్రలో ముంబై తరహాలోనే... గుజరాత్‌లో అహ్మదాబాద్‌ కరోనా వ్యాప్తి కేంద్రంగా మారుతోంది. నిన్న కొత్తగా 217 కేసులు నమోదైతే...వాటిలో 151 కేసులు అహ్మదాబాద్ నుంచే ఉన్నాయి. అహ్మదాబాద్‌లో మొత్తం 1652 కరోనా కేసులు ఉన్నాయి. 69 మంది చనిపోయారు. 

 

గుజరాత్‌లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఆర్మీ అధికారులకు కరోనా పాజిటివ్ వచ్చింది. వీళ్లను కలిసినట్టుగా అనుమానిస్తున్న 28 మందిని క్వారంటైన్‌కు పంపారు. గడిచిన వారం రోజుల వ్యవధిలో మహారాష్ట్రలో కరోనా కేసులు రెట్టింపు అయితే.. గుజరాత్‌లో మూడింతలయ్యాయి. తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను వెనక్కి నెట్టేసి గుజరాత్‌ కేసుల విషయంలో దూసుకెళుతుంది. కరోనాను కట్టడి చేయలేకపోతే గుజరాత్ మరో వారం రోజుల్లోనే దేశానికి కరోనా కేంద్రంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. కరోనా టెస్టుల విషయంలో గుజరాత్ ప్రభుత్వం వేగంగా స్పందించడం లేదన్న విమర్శలున్నాయి. లక్షణాలు బయటపడిన వెంటనే కాకుండా..క్రిటికల్ స్టేజ్‌లో ఉన్న పేషెంట్లకు కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల లోపు మాత్రమే కరోనా పరీక్షలు జరిగాయి. రాష్ట్రంలో 13 మంది కరోనా పాజిటివ్ వచ్చిన రోజే చనిపోయారు. 

 

మిగతా రాష్ట్రాలతో పోల్చితే గుజరాత్‌లో కరోనా రికవరీ రేటు కూడా చాలా తక్కువగా ఉంది.  దేశవ్యాప్తంగా రికవరీ రేటు 19 శాతం ఉంటే గుజరాత్‌లో మాత్రం 6 శాతం కూడా లేదు. కేసులు వేగంగా పెరుగుతుంటే... కోలుకునే వారి సంఖ్య మాత్రం నామమాత్రంగా ఉంటోంది. చాలా విషయాల్లో గుజరాత్‌ను మోడల్ స్టేట్‌గా చెప్పుకుంటారు. కానీ కరోనాను డీల్ చేసే విషయంలో మాత్రం ఆ రాష్ట్రం వెనుకపడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: