ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధ్యక్షునిగా కళా వెంకట్రావు ఉన్నారు. ఆయనను తప్పిస్తారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల తరువాత రాష్ట్రంలో పార్టీ రోజురోజుకు బలహీనపడుతోంది. ఇలాంటి సమయంలో పార్టీలో కొత్త ఉత్సాహం రావాలంటే నారా లోకేష్ ను ఆ పదవిలో నియమించాలనే వాదన వినిపిస్తోంది. తాజాగా వైసీపీ మంత్రులు అవంతి శ్రీనివాస్, అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో లోకేష్ ను పార్టీ అధ్యక్షునిగా నియమిస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
వైసీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ ఇరకాటంలో పడింది. కళా వెంకట్రావు కష్టపడి పని చేస్తుంటే ఆయన స్థానంలో లోకేష్ ను ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. అవంతి శ్రీనివాస్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారంటే టీడీపీకి ఈ తరహా ఉద్దేశం ఉండటం వల్లే చేసి ఉంటారని వైసీపీ, టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు నారా లోకేష్ మాట తీరు మార్చుకోవడం, కొంత పాలనానుభవం తెచ్చుకోవడం కూడా అయనను టీడీపీ అధ్యక్షునిగా నియమించవచ్చనే భావనకు బలం చేకూరుస్తుంది. 
 
టీడీపీకి వారసుడిని ప్రకటించకపోతే పార్టీకి భవిష్యత్తులో సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. 2024 ఎన్నికల సమయానికి బాబుకు 75 ఏళ్లు వస్తాయి. బాబు గతంలోలా ప్రచారం చేయడం కూడా సాధ్యం కాకపోవచ్చు. అందువల్ల వారసుడిని ప్రకటిస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో లోకేష్ ను వారసుడిగా ప్రకటిస్తే పార్టీ నుంచి కీలక నేతలు వెళ్లిపోయే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. 
 
జూనియర్ ఎన్టీఆర్ ఐతే ఇప్పుడు పార్టీలో చేరే అవకాశం లేదు. లోకేష్ పార్టీ అధ్యక్షుడిగా కూడా పనికిరాడనే ఆయనకు అవకాశం ఇవ్వట్లేదనే ప్రచారం జరుగుతోంది. మరి టీడీపీ లోకేష్ ను నియమిస్తుందా....? లేదా...? చూడాల్సి ఉంది. ఒకవేళ చంద్రబాబు లోకేష్ ను పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తే ఆయన జగన్ ను ఢీ కొట్టగలరా...? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: