ఎంత శత్రుత్వం ఉన్నా, ఎంత మితృత్వం అయినా, రాజకీయం రాజకీయమే. రాజకీయాల్లో ఉన్నవారు ఎప్పుడు ఏ అవకాశం దొరికితే ఆ అవకాశాన్ని పట్టుకుని పైకి ఎదిగేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ విధంగానే ఎదిగేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నట్లుగా అనిపిస్తోంది. జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పవన్ టిడిపి కి అనుకూలంగా ఉంటూ వచ్చారు. 2014 ఎన్నికల్లో బిజెపి, టిడిపి పార్టీలకు మద్దతు తెలపడమే కాకుండా, వారి తరఫున ఎన్నికల ప్రచారానికి రాష్ట్రమంతా పవన్ తిరిగారు. కాకపోతే అప్పుడు పరిస్థితులు అనుకూలించకపోవడంతో, జనసేన ఎన్నికల బరిలోకి దిగలేదు. ఇక 2019 ఎన్నికల్లో పోటీకి దిగినా, తగినంత బలం లేకపోవడంతో ఓటమి చెందింది.

IHG

ఇక ఇప్పటి నుంచే పవన్ 2024 ఎన్నికల నాటికి అధికారం దక్కించుకోవాలనే కసితో ముందుకు వెళ్తున్నారు. అధికారం దక్కాలి అంటే...  తప్పనిసరిగా బిజెపి అండదండలు ఉండాలనే అభిప్రాయం ఆయనలో ఉంది. అందుకే ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అన్నింటిని చూస్తున్న పవన్ కు 2024లో అధికారంలోకి రావాలంటే ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ మరింత బలహీనం అయితే తప్ప, తనకు అవకాశం ఉండదనే అభిప్రాయంలో ఉన్నట్టు గా కనిపిస్తున్నారు. అదీ కాకుండా జనసేన బిజెపి కూటమి ఏపీ రాజకీయాల్లో తిరుగులేని పార్టీగా మారాలి అంటే, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఉండకూడదని, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ జనసేన అన్నట్లుగా పోటీ ఉంటుందని, అప్పుడు తమకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే అంచనాతో పవన్ లెక్కలు వేసుకుంటునట్లుగా ఆయన వ్యవహారం ఉంది.

 

టిడిపిని బలహీనం చేస్తే మంచిది అనే క్రమంలోనే అధికార పార్టీ వైసిపికి అనుకూలంగా అప్పుడప్పుడు పవన్ స్టేట్మెంట్లు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా బిజెపి జనసేన పార్టీ రెండు టిడిపికి మరింత దూరంగా జరిగాయనే వ్యాఖ్యలు లేకపోలేదు. క్రమంగా తెలుగుదేశం పార్టీని బలహీనం చేసి ఏపీలో బలపడాలని బిజెపి చూస్తున్న సమయంలోనే, ఇప్పుడు పవన్ ద్వారా ఆ వ్యవహారాన్ని చక్కబెట్టుకునే చర్యలకు దిగినట్లు కనిపిస్తుంది. మరి బిజెపి జనసేన కూటమి తెలుగుదేశం పార్టీకి అడ్రస్ లేకుండా చేస్తారా లేదా అనేది ముందు ముందు చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: