హిందూధర్మ ఆచారాలు, మత విశ్వాసాలను ప్రపంచం నలమూలలా విస్తరించేలా అయోధ్యలో రామమందిరాన్ని నిర్మిస్తున్నారు. అయోధ్య రామమందిర నిర్మాణ శంకుస్థాపన ఓ మహోత్సవంలానే జరుగబోతోంది. ఈ కార్యక్రమాన్ని పండుగలా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నాయి హిందుత్వ సంఘాలు.
రామమందిర శంకుస్థాపన కోసం దేశ వ్యాప్తంగా ఉన్న పీఠాధిపతులు పుణ్య నదీజలాలు, మృత్తికలను సేకరించారు. తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలనుంచి పవిత్రజలాలు, మృత్తికలను తరలించారు. ఇలా దేశవ్యాప్తంగా ప్రముఖ క్షేత్రాల నుంచి సేకరించిన జలాలు, మృత్తిక..  ఐదు వేలకు పైగా కలశాల్లో అయోధ్య చేరుకున్నాయి.

మరోవైపు  ఓ ఇద్దరు సోదరులు రామాలయ నిర్మాణం కోసం చేసిన ప్రయాస అంతా ఇంతా కాదు. 151 నదులు, 8 మహానదులు, 3 సముద్రాల నీటిని రామభక్తులు రాధేశ్యామ్‌ పాండే, శబ్ధ వైజ్ఞానిక్‌ మహాకవి త్రిఫల అనే అన్నదమ్ములు తరలించారు. వీటితో పాటు శ్రీలంకలోని 16 పవిత్ర ప్రదేశాల్లోని మట్టిని రామజన్మస్థలానికి తరలించారు. అయోధ్యలో భవ్య రామాలయం ఈ సోదరుల కల. ఈ కల నెరవేరుతుందనే విశ్వాసాన్ని నిలువెల్లా నింపుకొని ఇప్పటివరకు 150కిపైగా నదీ జలాలను సేకరించి భద్రపరిచారు. రామమందిర నిర్మాణ భూమి పూజకు ఎప్పుడైతే ముహూర్తం కుదిరిందో వాటిని తీసుకొని అయోధ్యకు చేరుకున్నారు. 1968 నుంచి 2019 వరకు వివిధ మార్గాల్లో 150 నదీ జలాలను, 3 సముద్ర జలాలను సేకరించారు. వీటిని ఆ శ్రీరామచంద్రుడికి అర్పించే సమయం ఆసన్నం కావడంతో వారి ఆనందానికి అవధుల్లేవు.

మరో కీలక ఘట్టాన్ని కూడా కొన్ని రోజులు క్రితం యూపీ ముఖ్యమంత్రి  యోగి ఆదిత్యనాథ్ పూర్తి చేశారు. రాముని విగ్రహాన్ని రామ జన్మభూమి ప్రాంగణంలోకి తరలించారు. చైత్ర నవరాత్రి పర్వదినం రోజున సీఎం యోగి అయోధ్యలో  ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వయంగా తన చేతుల మీదుగా రామజన్మభూమి ప్రాంగంణంలో మానస భవన్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణంలోకి రాముని విగ్రహాన్ని తరలించారు.

9.5 కిలోల సింహాసనంపై రాముని విగ్రహాన్ని తాత్కాలిక నిర్మాణంలో ప్రతిష్టించారు. రాజ అయోధ్య విమలేంద్ర మోహన్ మిశ్రా ఈ సింహాసనాన్ని బహుమతిగా ఇచ్చారు. జైపూర్ కళాకారులు రాముని సింహాసనాన్ని తయారు చేశారు. ఆలయ నిర్మాణానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 11 లక్షలు విరాళంగా ఇచ్చారు. రామమందిర భూమి పూజకు అయోధ్యనగరి సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. భూమి పూజకు శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్‌ అన్ని ఏర్పాట్లు చేసింది.  ఆలయాలు, రహదారులు సహా అన్నీ శోభాయమానంగా తీర్చిదిద్దారు. భూమిపూజను ఎన్నో విశేషాల సమాహారంగా,  ఓ చరిత్రాత్మక కార్యక్రమంగా నిలపాలన్న సంకల్పంతో  ఏర్పాట్లు చేస్తున్నారు.
 
బుధవారం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 15 నిమిషాల 15 సెకన్లకు భూమి పూజ మొదలవుతుంది. 32 సెకన్లలో శంకుస్థాపన జరిగేలా ముహూర్తం నిర్ణయించారు. ఇందుకుగాను నక్షత్రాల్లాంటి 5 వెండి ఇటుకలను వాడుతారు. ప్రధాని మోదీ రామ జన్మభూమి ప్రాంతానికి ఉదయం 11.30 గంటలకు చేరుకుంటారు. ప్రధాని వచ్చేలోగా కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను పూర్తిచేస్తారు. ప్రాచీన హనుమాన్‌ దేవాలయంలోను ప్రధాని పూజలు చేస్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: