నిన్న అయోధ్యలో రామాలయానికి భూమి పూజ జరిగింది. దేశవ్యాప్తంగా హిందువులంతా పండుగ చేసుకున్నారు. శతాబ్ధాల తమ కల నెరవేందని ఆనంద పరవశులయ్యారు. ఊరూ వాడా పండుగ చేసుకున్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఇవే దృశ్యాలు కనిపించాయి. అయితే పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం రాజంపాలెంలో మాత్రం రాముడి గుడి సందడితో పాటు... మరొకరి గుడి నిర్మాణం కూడా సందడి చేసింది.










అదే జగన్ గుడి.. అవును ఏపీ సీఎం జగన్ కు గుడి కడుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు గుడి నిర్మించాలని పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం రాజంపాలెంలో వైసిపి నేతలు నిర్ణయించుకున్నారు. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకటరావు ఈ గుడికి శంకుస్థాపన కూడా చేశారు. దేశమంతా రామాలయ భూమి పూజ సందడి జరుగుతున్న సమయంలోనే ఇది కూడా జరిగింది. కరోనా సంక్షోభ సమయంలో కూడా ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర అబివృద్ధికి అహర్నిశలు  పాటుపడుతున్నారని... సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని.. వైసీపీ నేతలు చెబుతున్నారు.





తమ అభిమాన నటీనటులకు, నాయకులకు గుడులు కట్టడం గతంలోనూ చూశాం.. ఈ సంస్కృతికి ఆధ్యులు మాత్రం తమిళనాడు వారే అని చెప్పాలి. అక్కడ జయలలిత, ఎంజీఆర్ వంటి నాయకులకు గుడులు కట్టారు. అంతే కాదు.. ఖుష్బూ, సిమ్రాన్ వంటి హీరోయిన్లకూ గుడులు కట్టిన చరిత్ర తమిళనాడుకు ఉంది. ఇప్పుడు ఈ సంస్కృతి తెలుగు రాష్ట్రాలకూ పాకింది. గతంలోనూ ఇలా గుడులు కడుతున్నామంటూ కొందరు హడావిడి చేశారు.










ఏపీలో గతంలో చంద్రబాబుకు గుడి కడుతున్నామని టీడీపీ నేతలు కొందరు కాస్త హడావిడి చేశారు. తెలంగాణలో కేసీఆర్ కు కూడా గుడి కట్టారు. అంతే కాదు.. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కు సైతం తెలంగాణలో ఓ అభిమాని గుడి కట్టేశాడు. ఏపీ సీఎం జగన్ కు గుడి కట్టడం మాత్రం ఇదే ఫస్ట్ టైమ్‌ అనే చెప్పాలి. జగన్ కు గుడి నిర్మిస్తున్నామని పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ నేతలు చెబుతున్నారు. పార్టీ నేతల సహకారంతో ఆలయం నిర్మించి, అందులో జగన్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు  వైసీపీ నేతలు వెల్లడించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: