ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ పుట్టినిల్లు ఓ పోలీస్‌ స్టేషన్‌ అంటే నమ్మగలరా. వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా... అది ముమ్మాటికీ నిజం. దుర్గమ్మను తమ ఆడపడుచుగా భావిస్తారు బెజవాడ పోలీసులు. ఎన్నో ఏళ్లుగా ఆ సంప్రదాయం కొనసాగుతోంది.

విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనక దుర్గమ్మకు ఏ పూజ చేసినా... వన్‌టౌన్‌ పోలీసులు పాల్గోడం ఆనవాయితీగా వస్తోంది. మరీ ముఖ్యంగా దసరా ఉత్సవాలు ప్రారంభం కావాలంటే... పోలీస్ స్టేషన్ నుండి అమ్మవారికి మొదటి సారె తీసురావల్సిందే.

బెజవాడ పోలీసులు అమ్మవారిని తమ తోబుట్టువుగా భావిస్తారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ప్రారంభానికి ముందే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో  సందడి మొదలవుతుంది. నవరాత్రులు ప్రారంభం ముందు రోజు రాత్రి పోలీస్‌ స్టేషన్ నుంచి అమ్మవారికి పసుపు, కంకుమ, చీర, సారెను తీసుకుని వెళ్తారు అధికారులు. పోలీస్‌ స్టేషన్‌ నుంచి అందిన చీరను అమ్మవారికి అలంకరించిన తర్వాతే... దసరా ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.

ఒకప్పుడు ఇంద్రకీలాద్రి ప్రాంతంలో అడవి విస్తరించి ఉండేది. 15వ శతాబ్దంలో కొండవీటి రాజుల హయాంలో కృష్ణా నది పక్కన గల ప్రదేశంలో జన సంచారం ఉండేది కాదు. ఇక పల్లె సంతతికి చెందిన వాళ్ళు కృష్ణా నదిలో చేపలు పట్టేవారు. వీరంతా కృష్ణా తీరంలో పట్టిన చేపల్ని కొండపల్లికి తీసుకెళ్లే వారు. మార్గమధ్యంలో ప్రస్తుతం వన్‌టౌన్ ప్రాంతంలో గల దిబ్బపై ఆగి భోజనాలు చేసి, కాస్త సేదతీరుతుండే వాళ్లు. కొన్నాళ్లకు పల్లెకారులు అక్కడ నివాసం ఉండడం ప్రారంభించారు. ఇలా దాదాపు 60 నుంచి 70 కుటుంబాలు పల్లెదిబ్బ వద్ద స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాయి.

పల్లెదిబ్బలో నివసిస్తున్న వారి రక్షణ కోసం కొండపల్లి రాజులు ఇద్దరు సైనికుల్ని నియమించారు. అయితే, సిపాయిలు చిన్న తప్పు చేయడంతో వాళ్లను విధుల నుంచి తొలగించారు పాలకులు. దీంతో ఆ ఇద్దరు సైనికులు కూడా పల్లె కారులతో కలిసి పశువుల్ని, మేకల్ని మేపుకుంటు అక్కడే ఉండేవాళ్ళు. ఓ సందర్భంలో సైనికుల్లో ఒకరైన మంగయ్య మేకల్ని తొలుకుంటు ఇంద్రకీలాద్రిపైకి వెళ్ళాడు. ఏదో ఆలోచిస్తూ తాను కూర్చున్న ప్రదేశంలో మట్టిపై ఓ చిన్నా రాయితో గీయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో మెల్ల అమ్మవారి రూపు బయట పడింది. ఇంటికి వెళ్లిన తర్వాత ఈ విషయాన్ని తన కూతురికి వివరించాడు మంగయ్య. అయితే, రాత్రి మంగయ్య కలలోకి వచ్చిన అమ్మవారు... తనకు నిత్యం పూజలు చేయాలని ఆదేశించింది. దీంతో మరుసటి రోజే అమ్మవారి విగ్రహం బయటపడిన ప్రదేశంలో చిన్న పందిరి వేసి... అమ్మవారికి పూజలు చేయడం ప్రారంభించాడు.

కొంత కాలానికి మంగయ్యకు మరో సారి కలలో అమ్మవారు ప్రత్యక్షమై... నీ ఉద్యోగం నీకు తిరిగి లభిస్తుందని చెప్పింది. అలాగే, తనను తోబుట్టువుగా భావించి దసరా ఉత్సవాల సమయంలో పసుపు, కుంకుమలు పెట్టాలని ఆదేశించింది అమ్మవారు. చివరి రోజు నీ ఇంటికి వచ్చి పుసుపు-కుంకుమలు స్వీకరించి అందర్నీ ఆశీర్వదిస్తానని మాటిచ్చింది.

అప్పటి నుండి మంగయ్య అమ్మవారికి పూజలు చేస్తూ వచ్చాడు... తన కూతురికి కూడా దుర్గ అని నామకరణం చేశాడు. అయితే, కొంత కాలం తర్వాత దసరా రోజున అమ్మవారు కిందకు వచ్చే సమయానికి మంగయ్య కూతురు అమ్మవారిలో ఐక్యమైపోయిందని ఇక్కడి స్థల పురాణం బట్టి తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: