బ్రిటన్ లో ఫైజర్ వ్యాక్సిన్ పంపిణీ మొదలు కాబోతోంది. దీంతో ప్రపంచ దేశాల కన్ను బ్రిటన్ పై పడింది. మన దేశం నుండి బ్రిటన్ వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవాలనుకునే వారు పెరుగుతున్నారు.
బ్రిటన్ ప్రభుత్వం ఫైజర్ వ్యాక్సిన్ పంపిణీకి అనుమతులు ఇచ్చిందో లేదో, అప్పటి నుంచి బ్రిటన్ వెళ్లేందుకు ఎంక్వైరీలు మొదలయ్యాయని ట్రావెల్ ఏజెన్సీ సంస్థలు చెప్తున్నాయి. బ్రిటన్ ఎప్పుడు.. ఎలా వెళ్లొచ్చనే దానిపై బుధవారం సాయంత్రం నుంచే ఫోన్ లు వస్తున్నాయట.
వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపిన బ్రిటన్ ప్రభుత్వం.. తొలి ప్రాధాన్యంగా వృద్ధులకు, ఆరోగ్య సిబ్బందికి టీకా ఇవ్వనుంది. అయితే బ్రిటన్ ప్రభుత్వం విదేశీయులకు వ్యాక్సిన్ ఎప్పుడిస్తారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ట్రావెల్ ఏజెన్సీలు కూడా ఇప్పటికిప్పుడు భరోసా ఇవ్వలేమంటున్నాయి. ఈ విషయంపై బ్రిటన్ ప్రభుత్వం స్పష్టత ఇస్తే.. ప్రయాణీకుల కోసం తాము ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామని ట్రావెల్ ఏజెన్సీ సంస్థలు అంటున్నాయి.
ఈ మధ్యే బ్రిటన్ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణీకులకు పలు నిబంధనలు విధించింది. విదేశాల నుంచి బ్రిటన్ వచ్చినవారు తప్పనిసరిగా ఐదురోజులపాటు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండి, ఆరో రోజు కరోనా పరీక్ష చేసుకున్నాక బయటకు రావాలని చెప్తోంది. ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్ కోసం వెళ్లేవారు అన్ని రోజులు బ్రిటన్లోనే ఉండాలో.. అసలు విదేశీయులకు ఇప్పుడప్పుడే టీకా ఇస్తారో లేదో ఇప్పటికైతే క్లారిటీ రానట్టే.
మరోపక్క అమెరికాకు వ్యాక్సిన్ టూరిజం ఊపందుకునేలా కనిపిస్తోంది. కొన్ని ట్రావెల్ కంపెనీలు ఈ దిశగా ప్యాకేజీలు కూడా ప్రకటిస్తున్నాయి. ఇన్నాళ్లు నష్టపోయిన వ్యాపారాలను మళ్లీ పట్టాలెక్కించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అమెరికాలో ఫైజర్ వ్యాక్సిన్ విడుదల అవ్వగానే ఎంపిక చేసిన కొద్దిమంది క్లయింట్లకు వ్యాక్సిన్ అందిస్తామని చెప్తున్నాయి. 3 రాత్రులు/4 పగళ్లు ట్రిప్ వ్యాక్సిన్ తో కలిపి రెండు లక్షల రూపాయల వరకు చార్జ్ చేస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి