రాష్ట్రంలో భూముల రీ-సర్వే చేపట్టేందుకు యంత్రాంగాన్ని సిద్దం చేస్తోంది ఏపీ సర్కార్. ఈ నెల 21వ తేదీనే భూముల రీ-సర్వేను ప్రారంభించనుండటంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఏపీ సర్కార్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటోంది. సర్వే పక్కాగా ఉండేలా.. ఎలాంటి వివాదాలకు చోటు ఇవ్వకుండా చేపడుతోంది. ఇందుకోసం కేంద్రం 200 కోట్ల రూపాయలను కేటాయించింది.

ఏపీలో భూముల రీ-సర్వేను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాదాపు వందేళ్ల తర్వాత జరుగుతున్న భూముల సర్వే కావడంతో పక్కా ప్రణాళికతో అడుగులేస్తోంది ప్రభుత్వం. అధికార యంత్రాంగాన్ని ఎక్కడికక్కడ సంసిద్దత చేస్తోంది. ఈ నెల 21 తేదీన కృష్ణా జిల్లా జగ్గయ్య పేట మండలం తక్కెళ్లపాడులో ముఖ్యమంత్రి భూముల రీసర్వే ప్రక్రియను ప్రారంభించనున్నారు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ రీసర్వే చేపడుతోంది ప్రభుత్వం. గతంలో వైఎస్ హయాంలో భూ భారతి పేరిట రీ సర్వే మొదలు పెట్టినా  సఫలం కాలేదు. అప్పట్లో భూ-భారతి కార్యక్రమాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పడంతో వర్కవుట్ కాలేదు. ఇప్పుడు సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం17వేల 466 గ్రామాల్లో 2 కోట్ల, 26 లక్షల ఎకరాల ప్రాంతాన్ని సర్వే చేయనుంది ప్రభుత్వం.

వ్యవసాయ భూములతో పాటు ఇళ్ల ఆస్తులను కూడా సర్వే చేయనుంది. శాశ్వతంగా భుహక్కు ఇవ్వటంతో పాటు భూ వివాదాల పరిష్కారానికి వీలు కల్పించనుంది ప్రభుత్వం. అలాగే సర్వే చేసిన వెంటనే భూ హద్దులు నిర్ణయం చేసి యజమానికి ల్యాండ్ టైటిల్‌ను అప్పగించనున్నారు. గ్రామాల్లో భూ తగాదాలు శాశ్వతంగా లేకుండా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం సిబ్బందికి శిక్షణ ఇస్తోంది. డ్రోన్లు, కార్స్ టెక్నాలజీ సాయంతో భూముల రీసర్వే చేపడుతోంది. ఇందుకు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది.

మరోవైపు ఏపీలో భూముల రీసర్వే కోసం కేంద్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయల్ని కేటాయిస్తోంది. రాష్ట్రంలో సర్వే చేసేందుకుగానూ చదరపు కిలోమీటరు ప్రాంతానికి సర్వే ఆఫ్ ఇండియాకు 5 వేల రూపాయల చొప్పున చెల్లించనుంది ఏపీ ప్రభుత్వం. కార్స్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చేసే భూముల రీ-సర్వేలో కేవలం 5 సెంటిమీటర్ల మేర మాత్రమే వ్యత్యాసం వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. భూముల రీసర్వేలో వివాదాలు తలెత్తితే మూడంచెల వ్యవస్థను సిద్ధం చేస్తోంది ఏపీ ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: