గత ఎన్నికల్లో జగన్ గాలిని తట్టుకుని సైతం టిడిపి తరఫున 23 మంది ఎమ్మెల్యేలు గెలిచిన విషయం తెలిసిందే. ఊహించని విధంగా జగన్ వేవ్‌కి ఎదురు నిలబడి టిడిపి ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే టీడీపీ గెలిచిన స్థానాలు చాలావరకు ఆ పార్టీకి కంచుకోటగా ఉన్నాయి. అయితే వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితి మారుతుంది. కొన్ని స్థానాల్లో టిడిపి ఎమ్మెల్యేలు వీక్ అవుతున్నారు.

ఈ క్రమంలోనే అధికారంలో ఉన్న వైసీపీ, టిడిపి కంచుకోటలని దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మొదటి నుంచి టీడీపీకి అండగా ఉన్న ఇచ్ఛాపురం నియోజకవర్గంలో వైసిపికి అనుకూలంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇచ్చాపురంలో టిడిపికి తిరుగులేదని సంగతి తెలిసిందే. ఆ పార్టీ ఆవిర్భావం అంటే 1983 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో టిడిపికి ఒక్కసారి మాత్రమే ఓటమి ఎదురైంది.

2004లో మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఇక మిగిలిన అన్ని సార్లు ఇక్కడ టీడీపీదే విజయం. టీడీపీ తరఫున గత రెండు ఎన్నికల నుంచి ఇచ్చాపురంలో బెందాళం అశోక్ విజయం సాధిస్తూ వస్తున్నారు. 2014లో టీడీపీ అధికారం ఉండటంతో అశోక్‌కి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. ఐదేళ్లపాటు అధికారం ఉండటంతో, అనుకున్న పనులు జరిగాయి. కానీ ఇప్పుడు అధికారం లేదు. దీంతో అశోక్‌ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా సరే ప్రజలకు అందుబాటులో ఉండడంలో వెనకబడి ఉన్నారని తెలుస్తుంది.


ఈయన ఎక్కువ సమయం విశాఖపట్నంలో ఉంటున్నారని, సొంత కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండటం లేదని విమర్శలు ఉన్నాయి. అయితే ఇచ్ఛాపురం నియోజకవర్గంలో వైసీపీ నేత ప్రియ సిరాజ్ దూకుడుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కావాల్సిన పనులు చేయడంలో ముందున్నారు. పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాలను అందజేస్తున్నారు. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ముందుకెళ్తున్నారు. అలాగే పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.

ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సైతం వైసీపీని పెద్ద ఎత్తున గెలిపించారు. అలాగే ఇచ్చాపురం మున్సిపాలిటీ వైసీపీ ఖాతాలో పడేలా చేశారు. ఈ పరిస్థితిని బట్టి చూస్తే ఇచ్చాపురంలో టిడిపికి అనుకూల పరిస్తితి కనిపించడం లేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే నెక్స్ట్ ఎన్నికల్లో ఇచ్చాపురంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: