కేసీఆర్ సమకాలీన రాజకీయాల్లో దిగ్గజ నాయకుడు. ఆయన అందరిలాంటి వాడు కాదు.. మాటలతోనే మాయచేస్తాడు.. ఆయన అంతగా హత్తుకునేలా మాట్లాడటం వెనుక అసలైన రహస్యం ఉంది. అదేంటంటే ఆయన తెలుగు భాషలో దిట్ట.. తెలుగు భాష విద్యార్థి.. తెలుగు భాషను, సాహిత్యాన్ని అధ్యయనం చేసిన వ్యక్తి. అందుకే భావ ప్రకటనలో ఆయనది ప్రత్యేక శైలి. ఆయన కేవలం రాజకీయ నాయకుడే కాదు.. ఆయన ఓ కవి కూడా.. ఒకటి  రెండు సినిమాలకు ఆయన పాటలు కూడా రాసిన సంగతి తెలిసిందే.


కవులు, కళాకారుల గొప్పదనం.. వారి ప్రత్యేకత కేసీఆర్‌కు బాగా తెలుసు.. అయితే అలాంటి కేసీఆర్ కూడా తాజాగా ఓ తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ శాసన మండలిలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా హుజూరాబాద్ నేత కౌశిక్‌ రెడ్డిని ఎంపిక చేశారు.. వాస్తవానికి గవర్నర్ కోటాలో కవులు, కళాకారులు, మేధావులను శాసన మండలికి పంపుతుంటారు. కవులు, కళాకారులు, మేధావులు, సామాజిక వేత్తలు సాధారణ ఎన్నికల ద్వారా శాసన మండలికి ఎన్నిక కాలేరు. అలాంటి వారి కోసం ఈ గవర్నర్‌ కోటా పెట్టారు.


అయితే.. ఈ గవర్నర్ కోటా కోసం తెలంగాణలో అర్హులు లేరా.. అంటే చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు వాగ్గేయ కారుడు దేశపతి శ్రీనివాస్, గీత రచయిత సుద్దాల అశోక్‌ తేజ వంటి వారు ఎందరో ఉన్నారు. గతంలో వాగ్గేయకారుడు గోరటి వెంకన్నకు కేసీఆర్ అవకాశం కల్పించారు. కూడా ఈసారి కూడా అదే తరహా ఆనవాయితీ కొనసాగించి ఉంటే బావుండేది కానీ.. కేసీఆర్గవర్నర్ కోటాను కూడా రాజకీయాల కోసం వాడేసుకోవడం బుద్ధి జీవులను నిరాశపరచడమే అవుతుంది.


తెలంగాణ ఉద్యమ సమయంలో ఎందరో కళాకారులు తమ సేవలు అందించారు. ఉద్యమానికి ఊపు తెచ్చారు. అలాంటి వారికి కేటాయించాల్సిన గవర్నర్ కోటాను ఓ రాజకీయ నాయకుడికి ఇవ్వడం ద్వారా కేసీఆర్ ఎలాంటి సందేశం ఇస్తున్నట్టు..?

మరింత సమాచారం తెలుసుకోండి: