తాడిపత్రిలో మొదటి నుండి రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటుంది. అలాంటిది రెండు వర్గాల నేతలు చెరో పదవిలో ఉంటే ఇంకేమన్నా ఉందా ? అందుకనే తాడపత్రి జనాల్లో  ఇపుడు టెన్షన్ పెరిగిపోతోంది. రెండువర్గాల మధ్య ఎప్పుడేమవుతుందో జనాలకు అర్ధం కావటంలేదు. ఇంతటి టెన్షన్ వాతావరణానికి ఒక విగ్రహం ఏర్పాటు కారణమవుతోంది. ఇంతకీ ఆ రెండు వర్గాలేవో ఈపాటికే అర్ధమైపోయుంటాయి. అవును వైసీపీ ఎంఎల్ఏ కేతిరెడ్డి పెద్దారెడ్డి-తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గాలే.




ఇంతకీ విషయం ఏమిటంటే జేసీ టీడీపీలో ఎంఎల్ఏగా ఉన్నప్పటి నుండే పెద్దారెడ్డితో పడేదికాదు. అలాంటిది 2019 ఎన్నికల్లో ఇద్దరు పోటీపడితే పెద్దారెడ్డి గెలిచారు. ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జేసీ గెలిచారు. అసలే ఇద్దరికీ పడదు. ఇపుడు ఒకరు ఎంఎల్ఏ అయితే మరొకరు మున్సిపల్ ఛైర్మన్ అయ్యారు. దాంతో ప్రతిరోజు రెండువర్గాల మధ్య గొడవలు జరుగుతునే ఉన్నాయి. తాజా గొడవకు కారణం ఏమిటంటే తన తండ్రి కేతిరెడ్డి రామిరెడ్డి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎంఎల్ఏ అనుకోవటంతోనే వివాదం మొదలైంది.




తాడిపత్రి-అనంతపురం జాతీయ రహదారిపై యాక్సిస్ బ్యాంకు ఎదురుగా రామిరెడ్డి విగ్రహం ఏర్పాటుకు ఎంఎల్ఏ ఏర్పాట్లు చేసేసుకున్నారు. అయితే దీనికి మున్సిపల్, రోడ్లు భవనాల శాఖ అనుమతి మాత్రం తీసుకోలేదు. నిజానికి రోడ్లపైన విగ్రహాలు ఏర్పాటు చేయకూడదని గతంలోనే సుప్రింకోర్టు తీర్పుంది. అయితే ఎంఎల్ఏ నియమాలను పాటించేది లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాను విగ్రహాన్ని ఏర్పాటు చేయదలచుకున్న ప్రాంతాన్ని ఇయర్ మార్క్ చేసి పెద్ద దిమ్మ కట్టి విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ దిమ్మపై నిలబెట్టేశారు.




విగ్రహం ఏర్పాటుకు ముహూర్తం ఎప్పుడన్నది ఎంఎల్ఏ బయటపెట్టలేదు. అయితే ఈలోపే ఛైర్మన్+కౌన్సిలర్లు విగ్రహం ఏర్పాటుకు వ్యతిరేకంగా మున్సిపల్ కమీషనర్ తో పాటు కలెక్టర్ కూ ఫిర్యాదుచేశారు. అయితే వీళ్ళేమీ చేయగలరు ? ఒకవైపు మున్సిపల్ ఛైర్మన్ మరోవైపు ఎంఎల్ఏ పట్టుదలకు పోతున్నారు. ఎలాగైనా విగ్రహం ఏర్పాటు చేస్తానని ఎంఎల్ఏ ఇప్పటికే ప్రకటించున్నారు. అనుమతులు తీసుకోకుండా విగ్రహాలను ఎలా ఏర్పాటు చేస్తారో చూస్తానంటు జేసీ చాలెంజ్ చేశారు. దాంతో మధ్యలో కమీషనర్, కలెక్టర్ నలిగిపోతున్నారు. చూస్తుంటే తొందరలోనే తాడిపత్రిలో మళ్ళీ ఉద్రిక్త పరిస్ధితులు తప్పేలా లేవని జనాలు గోల పెడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: