ఖాన్ తో గేమ్స్ ఆడద్దనే సినిమా డైలాగు చాలా పాపులర్. చంద్రబాబునాయుడు కూడా తనను తాను సినిమాలో ఖాన్ పాత్రదారిగా అనుకుంటున్నారో ఏమో అర్ధంకావటంలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే స్కిల్ స్కామ్ లో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న విషయం తెలిసిందే. ఆదివారంతో రెండురోజుల సీఐడీ కస్టడీ అయిపోయింది. అందుకనే మరికొద్దిరోజులు కస్టడీ పొడిగించాలని సీఐడీ లాయర్లు అడిగారు.

ఈ నేపధ్యంలోనే అక్టోబర్ 5వ తేదీవరకు చంద్రబాబుకు జడ్జి జ్యుడీషియల్ రిమాండు విధించారు. అంటే మరో 11 రోజులు చంద్రబాబు సెంట్రల్ జైలులోనే ఉండకతప్పదు. విచారణ కోసం చంద్రబాబును తమకు అప్పగించాలని సీఐడీ తరపు లాయర్లు జడ్జిని అడిగారు. ఈ విషయమై సోమవారం విచారణ జరగబోతోంది. ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే ఆదివారం విచారణ సందర్భంగా కోర్టు విచారణలో ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ జరిగింది. అదేమిటంటే రిమాండు ఇచ్చే విషయమై చంద్రబాబును జడ్జి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు.

ఈ విచారణలో చంద్రబాబును  జడ్జి రొటీన్ ప్రశ్నలే అడిగారు. అయితే చంద్రబాబు మాత్రం జడ్జిని రివర్సులో ప్రశ్నించారు. మామూలుగా ఏ కోర్టులో అయినా జడ్జి ప్రశ్నిస్తారు నిందితుడు సమాధానం చెబుతారు. కానీ ఇక్కడ జడ్జినే చంద్రబాబు రివర్సులో ప్రశ్నించారు. రెండు రోజుల సీఐడీ విచారణలో ఏమి తెలుసుకున్నారో చెప్పాలని జడ్జిని చంద్రబాబు అడగటమే ఆశ్చర్యంగా ఉంది. అయితే ఈ విషయమై జడ్జి ఏమీ సీరియస్ కాకుండా లాయర్లనే అడిగి తెలుసుకోమన్నారు. చంద్రబాబు రెండోసారి కూడా అదే అడగటంతో విచారణ మధ్యలో ఉన్నపుడు తాను చెప్పటం కుదరదని జడ్జి కచ్చితంగా చెప్పేశారు. స్కామ్ లో ప్రాథమిక సాక్ష్యాలున్నాయని జడ్జి చెప్పారు.

శని, ఆదివారాల్లో జరిగిన విచారణ రిపోర్టును సీఐడీ అధికారులు జడ్జికి సీల్డ్ కవర్లో అందించారు. అందుకనే విచారణ వివరాలను జడ్జిని చంద్రబాబు అడిగుంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే విచారణలో ఏమి తెలుసుకున్నారో చెప్పమని జడ్జినే అడిగిన చంద్రబాబు ఇక సీఐడీకి ఏమి సహకరించుంటారు ? ఇదే విషయమై సీఐడీ అధికారులు పిటీషన్లో వివరించారు. రెండురోజుల విచారణలో చంద్రబాబు ఏమాత్రం సహకరించలేదు కాబట్టే మరికొద్దిరోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. మరి జడ్జి ఏమంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: