రాజకీయాల్లో రాత్రికి రాత్రే సమీకరణాలు మారిపోతాయంటారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో అదే జరుగుతోంది. నిన్నటి వరకు బీజేపీని చూసి పాఠాలు నేర్చుకున్నారనుకున్న జనసేనాని, ఇప్పుడు ఏకంగా కాషాయ దళానికే దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదిగారంటే అతిశయోక్తి కాదు. ఆయన వేస్తున్న అడుగులు, తీసుకుంటున్న నిర్ణయాలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారుతున్నాయి.

విషయం ఏంటంటే, దేశ రక్షణలో అహర్నిశలు శ్రమిస్తున్న మన సైన్యానికి అండగా, వారిలో నూతనోత్తేజం నింపేందుకు పవన్ కళ్యాణ్ నడుం బిగించారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలోని ప్రఖ్యాత శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో సైనిక శక్తికి సూర్యతేజం తోడవ్వాలని ప్రత్యేక పూజలకు శ్రీకారం చుడుతున్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే.

దీంతో పాటు, దేశ సరిహద్దుల్లో నిత్యం ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కొంటున్న జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా వంటి కీలక సరిహద్దు రాష్ట్రాల ప్రజల శాంతి సౌభాగ్యాల కోసం, వారి క్షేమం కోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రముఖ క్షేత్రాల్లో ప్రత్యేక ఆరాధనలు, యాగాలు చేపట్టాలని జనసేనాని పిలుపునిచ్చారు.

పవన్ పవర్ ప్యాక్డ్ స్ట్రాటజీ కేవలం హిందూ ధర్మానికే పరిమితం కాలేదు. క్రైస్తవ సోదరులు చర్చిల్లోనూ, ఇస్లాం సోదరులు మసీదుల్లోనూ ప్రార్థనలు చేయాలని ఆయన కోరడం, అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నమే. "మనం మతాలకు అతీతంగా, దేశం కోసం ఒక్కటవ్వాలి, మనమంతా భారతీయులం" అనే గట్టి సందేశాన్ని తన అభిమానులకు, కార్యకర్తలకు, యావత్ ప్రజానీకానికి అందించారు.

ఇది కచ్చితంగా ఓ శుభ పరిణామం. రాజకీయ నాయకుడిగా కాకుండా, ఓ బాధ్యత గల పౌరుడిగా, దేశభక్తుడిగా పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆలోచింపజేస్తోంది. మత సామరస్యాన్ని చాటుతూ, దేశభక్తిని రగిలిస్తూ, సైనికులకు మనోధైర్యాన్నిస్తూ ఆయన ఇచ్చిన ఈ "యుద్ధ పిలుపు" నిజానికి ఇది శాంతియుత ఆధ్యాత్మిక సమరం, ప్రశంసనీయం. ఇకపై పవన్ మార్క్ రాజకీయం ఇలాగే ఉంటుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: