ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున ప్రశ్నించే శక్తి కలిగినవారే నిజమైన బలమైన ప్రతిపక్షం అవుతారు. ఆ గళం లేకపోతే ప్రభుత్వమూ, నాయకులూ కళ్లెంలేని గుర్రాల్లా మారిపోతారు. అందుకే ప్రజాస్వామ్య దేశాలు భావప్రకటన స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యత ఇస్తాయి. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే, ప్రతిపక్షాల తీరు, పోరాట ధోరణిలో స్పష్టమైన తేడాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ అధికారంలో ఉన్నప్పటికీ, వచ్చే ఎన్నికల కోసం ఇప్పటినుంచే మైదానంలోకి దిగి సన్నాహాలు చేస్తోంది. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ కూడా బలమైన ప్రతిపక్షంగా ప్రభుత్వంపై నిరంతరం విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రతి అంశంపైనా చురుకైన చర్చలు, వాదనలు, రోడ్లపై ఆందోళనలు జరుగుతున్నాయి. మూడు ప్రధాన పార్టీలు – కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ – ఎన్నికల కోసం పరస్పరం పోటీ పడుతున్నాయి. ఈ కారణంగా తెలంగాణ రాజకీయాల్లో మూడు పార్టీల నేత‌ల మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ వేడెక్కింది.


ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మాత్రం విభిన్నంగా ఉంది. ఇక్కడ ప్రధానంగా టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్యే పోరు సాగుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఉన్నా ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ ఒక్కటే ఉంది. కానీ, వైసీపీ తీరుపై గట్టిగా విమర్శలు వస్తున్నాయి. ప్ర‌తిప‌క్ష వైసీపీలో దూకుడు పూర్తిగా త‌గ్గింది. 2014-2019 మధ్య వైసీపీ అధినేత జగన్ గళం ఎంత బలంగా, దూకుడుగా వినిపించిందో, ఇప్పుడు ఆ స్థాయి లోపించింది. ప్రస్తుతం వైసీపీ కార్యకలాపాలు ఎక్కువగా పార్టీ అంతర్గత సమస్యల చుట్టూ తిరుగుతున్నాయి. ప్రజల సమస్యలపై పెద్దగా స్పందన లేదని ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి “ఉన్నా లేకపోయినా తేడా లేదన్న” స్థాయిలో ఉందని ప్రజల అభిప్రాయం. కమ్యూనిస్టు పార్టీల ప్రభావం కూడా మునుపటి కంటే చాలా తగ్గిపోయింది.


జనసేన, బీజేపీ లాంటి పార్టీలు ప్రస్తుతం అధికార కూటమిలో ఉన్నందున, ప్రజల తరఫున బలంగా పోరాడే అవకాశం ప్రతిపక్షం వైసీపీకి మాత్రమే ఉంది. కానీ, ఆ అవకాశం కూడా సరిగ్గా వినియోగం కావడం లేదనే విమర్శ వినిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం బలంగా ఉండాలి అంటే కేవలం సభలో మాటల యుద్ధం కాదు, రోడ్లపై ప్రజలతో కలసి పోరాడే శక్తి ఉండాలి. తెలంగాణలో ఈ పోటీ స్పష్టంగా కనిపిస్తుంటే, ఏపీలో మాత్రం ఒక్క పార్టీ ఆధిపత్యం ఉన్నా, ఆ పార్టీ తీరే బలహీనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: