జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ చౌదరి అనూహ్య మరణంతో ఈ నియోజకవర్గం ఉప ఎన్నికకు సిద్ధమవుతోంది. ఈ ఉప పోరు సాధారణ పోరాటం కాదు, హైదరాబాద్ మహానగరంలో కాంగ్రెస్ పట్టు సాధించగలదా ? అన్న ప్రశ్నకు సమాధానం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత ప్రతిష్టను పణంగా పెట్టి ఈ ఎన్నికను సీరియస్‌గా తీసుకుంటున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా, హైదరాబాద్ నుంచి ఒక్క సీటూ గెలవకపోవటం పార్టీకి చేదు అనుభవం. కానీ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో గెలిచిన శ్రీగణేశ్ విజయంతో పార్టీకి నగరంలో ఖాతా తెరుచుకుంది. ఈ తరుణంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించడం కాంగ్రెస్‌కు పెద్ద బూస్టర్‌గా మారుతుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం సీఎం రేవంత్ నివాస ప్రాంతం కావటం, ఈ పోరుకు మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది.


కాంగ్రెస్ క్యాడర్ ఇక్కడ బలంగా లేకపోవడం పార్టీకి పెద్ద సవాలు. గత ఎన్నికల్లో మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను నిలబెట్టినా ఫలితం రాలేదు. ఇప్పుడు కొత్త అభ్యర్థిని అన్వేషిస్తున్న కాంగ్రెస్‌లో దానం నాగేందర్ పేరు బలంగా వినిపిస్తోంది. మైనార్టీ ఓటు బ్యాంకుపై పట్టు, స్థానిక పరిచయం దానంకు ప్లస్ అవుతాయని భావిస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ వ్యూహాత్మకంగా ఉప పోరును ముందుకు తీసుకెళ్తున్నారు. జూబ్లీహిల్స్ మీద మంత్రులను తరచూ కార్యకలాపాలకు దింపి, అభ్యర్థి ప్రకటించే వరకు హైప్ క్రియేట్ చేస్తున్నారు. పార్టీ ప్రతి ఒక్కరూ ఈ పోరును తమ సొంత పోరాటంగా తీసుకోవాలని రేవంత్ పిలుపునిస్తున్నారు. ఆయన వ్యక్తిగత ఆసక్తి కారణంగా ఈ ఉప ఎన్నికకు భారీ క్రేజ్ ఏర్పడుతోంది. అయితే ఇక్కడే రిస్క్ కూడా ఉంది. ఎందుకంటే రేవంత్ ఇంతగా ఫోకస్ చేసిన తర్వాత, ఫలితం ప్రతికూలంగా వస్తే.. ఆయన ఇమేజ్‌కే కాదు, ప్రభుత్వ విశ్వసనీయతకే డ్యామేజ్ అవుతుంది.



అందుకే కాంగ్రెస్ తెర వెనుక పక్కాగా ప్లానింగ్ చేస్తూ, షెడ్యూల్ విడుదల కాగానే ప్రచార అస్త్రాలను ఒక్కొక్కటిగా బయటకు తీయాలని ఆలోచిస్తోంది. అధికార పార్టీగా కాంగ్రెస్ లక్ష్యం స్పష్టంగా ఉంది – ఈ ఉప పోరును ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్గా మార్చుకోవాలి. ప్రచారంలోనే ప్రత్యర్థులను డిఫెన్సివ్‌లో పడేసేలా చేసి, ఓటర్లలో గెలుపు వాతావరణం తీసుకురావడమే రేవంత్ లక్ష్యం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధిస్తే కాంగ్రెస్‌కు నగరంలో మరింత పట్టు వస్తుంది. ఓటమి అయితే రేవంత్ ప్రతిష్టకే గట్టి దెబ్బ. కాబట్టి ఈ పోరు సీఎం రేవంత్‌కు గెలుపు తప్ప మరే ఆప్షన్ లేకుండా మారింది. జూబ్లీహిల్స్ ఉప పోరు – కాంగ్రెస్ భవిష్యత్తు, రేవంత్ ఇమేజ్ – రెండూ పణంగా పెట్టిన యుద్ధరంగం!

మరింత సమాచారం తెలుసుకోండి: