
ఈ నేపథ్యంలోనే జగన్, "అలాంటి చర్యలు తీసుకుంటే మేము రాజీనామాలు చేస్తాం" అని స్పష్టంగా చెప్పినట్టు టాక్. జగన్ లెక్కల ప్రకారం, తాము రాజీనామాలు చేస్తే ఉపఎన్నికలు తప్పవు. ఆ ఉపఎన్నికలను ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోవడం, అసెంబ్లీకి రావడంలేదని జీతాలు ఆపేయడం, వైసీపీని అణగదొక్కడానికి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ప్రజల ముందుకు వెళ్లి చెబితే సానుభూతి వాతావరణంతో తాము తిరిగి ఎమ్మెల్యేలుగా గెలుస్తామన్నదే జగన్ ధీమాగా తెలుస్తోంది. గతంలో కూడా ఆయన సానుభూతిని తన బలంగా మలచుకున్న సందర్భాలు ఉన్నాయి.
ప్రస్తుతం రాష్ట్ర ప్రజల్లో ప్రభుత్వంపై ఆగ్రహం పెరుగుతోందని జగన్ అంచనా. "ఎందుకు గెలిపించామా?" అనే భావనతో ప్రజలు ఉన్నారని ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉపఎన్నికల ద్వారా ఆ భావనను మరింత బలంగా ప్రదర్శించే అవకాశముందని వైసీపీ భావిస్తోంది. జగన్ మాత్రమే కాకుండా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రాజీనామాలు చేస్తే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని విశ్లేషకుల అభిప్రాయం. అయితే జగన్ ఈ రాజీనామాలు నిజంగానే చేయిస్తారా ? లేదా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆడిన నాటకమా ? అన్నది కూడా చూడాలి.