
రాహుల్ కొత్త వ్యూహం – బీహార్ పై ఫోకస్ .. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పుడు బీహార్ రాజకీయాలను కొత్త కోణంలో చూస్తున్నారు. “యూపీ, బీహార్ దశ తిరగకపోతే దేశ దశ మారదు” అన్న అభిప్రాయంతో ఆయన ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తెర వెనక నుంచే సామాజిక సమీకరణాలపై అంచనాలు వేయించి, ఓబీసీ ఉద్యమాలు, యువ ఓటర్లతో సాన్నిహిత్యం పెంచే ప్రయత్నం చేస్తున్నారు. బీహార్‌లో కాంగ్రెస్ ప్రదర్శన మెరుగైతే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ప్రభావం చూపగలమనే నమ్మకం ఆయనలో ఉంది. ప్రస్తుతం బీహార్ రాజకీయాల్లో మహాఘట్‌బంధన్ గాలులు దూసుకుపోతున్నాయి. తేజస్వి యాదవ్ – రాహుల్ గాంధీ కాంబినేషన్ యువతలో హైప్ క్రియేట్ చేసింది. మైనారిటీల మద్దతు కూడా ఈ కూటమికి దక్కడం కీలకం. ఆర్జేడీ వంద సీట్ల టార్గెట్ పెట్టుకుంటే, కాంగ్రెస్ కూడా గట్టి పోటీకి సిద్ధమవుతోంది. మార్పు కోసమే ప్రజల దృష్టి ఈ వైపుకి మొగ్గుతుందని సర్వేలు చెబుతున్నాయి.
సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్‌కి యాంటీ ఇంకంబెన్సీ వాతావరణం ఉందని విశ్లేషకులు అంటున్నారు. వయస్సు, పాలనలో మాంద్యం, కూటమి కల్లోలాలు - అన్నీ కలిపి ఆయనను బలహీన పరుస్తున్నాయని అంచనాలు. మరోవైపు 34 ఏళ్ల తేజస్వి యాదవ్ కొత్త తరం నాయకుడిగా యువతలో పాజిటివ్ ఇమేజ్ సాధించారు. “యువతా వేవ్” బలంగా కనిపిస్తే బీహార్‌లో మార్పు తప్పదనే వాతావరణం ఉంది.బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కేవలం రాష్ట్ర పరిమితిలో కాకుండా దేశ రాజకీయ దిశను నిర్ణయించే సమరంగా మారాయి. నితీష్ అనుభవం గెలుస్తుందా? లేక తేజస్వి యాదవ్ యువ తుఫాన్ దుమ్ము రేపుతుందా? అన్నది ఇప్పుడు దేశమంతా గమనిస్తోంది. ఏదేమైనా బీహార్ రాజకీయ రణరంగం ఉత్కంఠ భరితంగా సాగనుంది అనేది మాత్రం ఖాయం!