
జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో మజ్లిస్ ఈసారి పోటీ చేయడం లేదు. నిజంగా పోటీ చేయాలనుకున్నా, ఓవైసీ ముందుగానే ప్రకటించేవారు. ఈ నియోజకవర్గంలో మజ్లిస్‌కు మంచి స్థిరమైన ఓటు బ్యాంక్ ఉంది. 2014 ఎన్నికల్లో మజ్లిస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఇప్పుడు ఆయనే కాంగ్రెస్ అభ్యర్థిగా రేసులో ఉన్నారు. అందువల్ల ఈసారి మజ్లిస్ కాంగ్రెస్‌కు అప్రత్యక్ష మద్దతు ఇవ్వొచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
మజ్లిస్ ఎప్పుడూ బహిరంగ ఒప్పందాలు చేయదు. పాతబస్తీ రాజకీయాల్లో తమ ప్రభావాన్ని కాపాడుకోవడానికి ఇతర పార్టీలతో లోపాయికారీ ఒప్పందాల ద్వారా ముందుకు సాగుతుంది. ఈసారి కూడా అదే తరహాలో వ్యవహరించబోతోందని టాక్ ? మజ్లిస్ సంపూర్ణ సహకారం కాంగ్రెస్‌కు లభిస్తే, ఆ పార్టీకి ఇది పెద్ద ప్లస్ అవుతుంది.
మరోవైపు బీజేపీ మాత్రం ఈ ఉపఎన్నికను అంతగా సీరియస్‌గా తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీ సానుభూతిపరుల్లో కూడా “ఇంత ముఖ్యమైన సీటులో ఎందుకు చురుకుదనం చూపడం లేదు?” అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఇటీవల ట్వీట్ చేస్తూ, “బీజేపీ, టీడీపీ కలిసి బీఆర్ఎస్‌కు సహకరిస్తున్నాయి” అంటూ ఆరోపించారు. టీడీపీ అయితే చాలా కాలంగా జూబ్లిహిల్స్‌లో పట్టు కోల్పోయింది. మొత్తానికి జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో ప్రధాన పార్టీల కంటే రాజకీయ సమీకరణాలే ఫలితాన్ని నిర్ణయించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మజ్లిస్ ఎటు మొగ్గుతుందన్నది ఈ ఉపఎన్నిక విజేతను నిర్ణయిస్తుంది అనడంలో సందేహం లేదు.