జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికల వేడి రోజురోజుకీ పెరుగుతోంది. ప్రధాన పార్టీలన్నీ తమ బలం ప్రదర్శించేందుకు రంగంలోకి దిగాయి. తాజాగా బీఆర్ఎస్ రహ్మత్‌నగర్‌లో నిర్వహించిన భారీ ప్ర‌చార కార్య‌క్ర‌మ ఉప ఎన్నిక ప్ర‌చార ప‌ర్వానికే హైలెట్ అయ్యింది. ఈ సభలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత భావోద్వేగానికి గురయ్యారు. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణిగా ఆమె మాట్లాడుతూ, తన భర్త ఈ నియోజకవర్గ ప్రజలను ఎంతో ప్రేమగా చూసుకున్నారని, ప్రతి సమస్యలో ప్రజలకు అండగా నిలిచారని కంటతడి పెట్టారు. గోపీనాథ్ సేవలను గుర్తు చేసుకుంటూ, తన భర్త నడిపిన మార్గంలోనే ముందుకు సాగుతానని మాగంటి సునీత తెలిపారు.


బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలతో కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పుడు “కారు కావాలో, బుల్డోజర్ కావాలో” నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే నియోజకవర్గంలో అభివృద్ధి కొనసాగుతుందని, కానీ కాంగ్రెస్ గెలిస్తే పేదల ఇళ్లపై బుల్డోజర్ నడుస్తుందని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్రంలో పేదలపై ప్రభుత్వ చర్యలు ఎలా జరుగుతున్నాయో ఉదాహరణలతో వివరించారు. బస్తీల రక్షణ కోసం కారు గుర్తుకే ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిందని, కానీ ఇప్పటివరకు ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలు మోసపోయారని, ఇప్పుడు నిజమైన అభివృద్ధి కోసం బీఆర్ఎస్‌నే మళ్లీ నమ్మాలని ఆయన కోరారు. త్వరలో పార్టీ నాయకులు ఇంటింటికి తిరిగి ఆ “గ్యారెంటీ మోసాలను” ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు.


బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు కూడా ఈ సభలో పాల్గొని కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జరగడం లేదని, ఏ పని చేయాలన్నా లంచాలు తప్పడం లేదని ఆరోపించారు. ఈ పరిస్థితి మారాలంటే జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీత గెలవాలని ప్రజలను కోరారు. ఆమె విజయం బీఆర్ఎస్ పునరుజ్జీవనానికి సంకేతమవుతుందని అన్నారు. ఇదిలా ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 13వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల గడువు 21వ తేదీ వరకు, పరిశీలన 22న జరుగుతుంది. 24వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది. పోలింగ్ నవంబర్ 11న, ఫలితాలు నవంబర్ 14న ప్రకటించబడతాయి. ఈ షెడ్యూల్ వెలువడడంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పోరు అధికారికంగా వేడెక్కింది.

మరింత సమాచారం తెలుసుకోండి: