దేశంలో ఎన్నికల చరిత్ర సుదీర్ఘ‌మైనా, పోలింగ్ బూత్‌ల సమస్య మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. బూత్‌లు దూరంగా ఉన్నాయ‌నే ఫిర్యాదులు, అలాగే భారీ క్యూలైన్లు చూసి చాలా మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోకుండానే వెనుదిరిగే ప‌రిస్థితి. దీనిపై దృష్టి సారించిన కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తాజాగా కీలక సంస్కరణకు నాంది పలికింది. పోలింగ్ ప్రక్రియను మరింత స‌ర‌ళ‌త‌రం చేసి, ఓట‌ర్ల‌ను ఉత్తేజ‌ప‌ర‌చ‌డానికి 'రేషనలైజేషన్' విధానాన్ని తీసుకువచ్చింది. ఈసీ తాజా ఉత్త‌ర్వులు: 1200కు మించకూడ‌దు! .. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం, దేశంలోని ప్రతీ పోలింగ్ బూత్‌లో ఓటర్ల సంఖ్య 1200 మందికి మించకుండా చూసుకోవాలి. ఒకవేళ అంతకుమించి ఓటర్లు ఉంటే, వెంటనే సమీపంలోనే కొత్త పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేయాలని ఈసీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం ఒక్కటే – ఓటర్ల ఉత్సాహాన్ని పెంచడం.
 

ఒకే కేంద్రంలో వేల మంది ఓటర్లు ఉంటే, ఐదు నిమిషాల పనికి గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తుంది. దీనివల్ల విసుగు చెందిన చాలా మంది ఓటు వేయకుండానే వెనక్కి వెళ్తారు. రేషనలైజేషన్ ద్వారా ప్రతీ కేంద్రంలో దాదాపు సమాన సంఖ్యలో ఓటర్లు ఉంటే, తక్కువ సమయంలో ఓటు వేసి రావచ్చు అనే భావ‌న‌తో ఓట‌ర్లు పోలింగ్‌కు ఉత్సాహంగా వచ్చే అవకాశం ఉంది. ఏపీలో మొద‌లైన రేషనలైజేషన్ ప్రక్రియ: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌లో రేషనలైజేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 1200 మందికి మించిన ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలను గుర్తించి, వాటిని విభజించి కొత్త కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఏపీ రాజకీయంగా కీలకమైన గుంటూరు జిల్లాలో ఈ ప్రక్రియను ప్రారంభించారు. గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో ప‌నులు చురుగ్గా సాగుతున్నాయి. కేంద్రాల సంఖ్య పెంపు: పశ్చిమ నియోజకవర్గంలో గతంలో 291 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం మరో 48 కేంద్రాలను అద‌నం చేసి మొత్తం 339 కేంద్రాలకు పెంచారు.

 

అలాగే, తూర్పు నియోజకవర్గంలో గతంలో ఉన్న 256 కేంద్రాలకు మరో 56 కేంద్రాలను జోడించి మొత్తం 312 కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాజ‌కీయ పార్టీల భాగ‌స్వామ్యం .. ఈ రేషనలైజేషన్ ప్రక్రియ అంతా సజావుగా, పారదర్శకంగా జరగడానికి అధికారులు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆహ్వానిస్తున్నారు. వారి సమక్షంలోనే కేంద్రాల విభజన, కొత్త కేంద్రాల ఏర్పాటు చేప‌డుతున్నారు. ఈ కేంద్రాల పేర్లు, చిరునామాలలో ఏవైనా మార్పులు ఉంటే వాటిని కూడా తమ దృష్టికి తీసుకురావచ్చని అధికారులు కోరుతున్నారు. అంతేకాకుండా, పోలింగ్ కేంద్రాల వారీగా బూత్ లెవల్ ఏజెంట్లను (BLA) నియమించుకోవాలని పార్టీల‌కు సూచిస్తున్నారు. ఈసీ తీసుకున్న ఈ కీలక నిర్ణయం వల్ల ఒకే పోలింగ్ కేంద్రంలో ఓటర్లు కిక్కిరిసిపోయే ప‌రిస్థితికి ఇక మీద‌ట ఫుల్‌స్టాప్ ప‌డ‌నుంది. ఇది ఓట‌ర్ల‌కు సమయం ఆదా చేయడమే కాకుండా, క్యూ లైన్ల శ్రమను తగ్గించి పోలింగ్ శాతాన్ని పెంచడానికి దోహదపడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: