దేశ రాజధాని ఢిల్లీ పేరు మారబోతోందా? ఈ ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ పేరును “ఇంద్రప్రస్థ”గా  మార్చాలని విశ్వహిందూ పరిషత్‌ ఇప్పటికే డిమాండ్‌ చేసింది. తాజాగా బీజేపీ ఎంపీ ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ కూడా అదే డిమాండ్‌ చేశారు. ఆయన మాటల్లో - “దేశ చరిత్ర, సాంస్కృతిక మూలాలను ప్రతిబింబించేలా ఢిల్లీని ఇంద్రప్రస్థగా పేరు మార్చడం సముచితం” అన్నారు. భారత చరిత్రలో ఢిల్లీకి ప్రత్యేక స్థానం ఉంది. మహాభారత కాలం నుంచి ఇప్పటి వరకు ఈ నగరం పలు సామ్రాజ్యాల పుట్టినిల్లు. మొఘలులనుండి బ్రిటిష్‌ల వరకు - ఢిల్లీ రాజధానిగా నిలిచింది. కానీ హిందూ పురాణాల ప్రకారం, ఇదే ప్రాంతం పాండవుల ఇంద్రప్రస్థ రాజధాని అని చెబుతారు.
 

మహాభారతంలో విశ్వకర్మ ఈ నగరాన్ని నిర్మించారని, యమునా తీరంలో ఉన్నదని వర్ణన ఉంది. ఇప్పుడు బీజేపీ నేతలు అదే కథనాన్ని రాజకీయ వేదికగా ఉపయోగిస్తున్నారు. ఎంపీ ప్రవీణ్‌ ఖండేల్వాల్‌ హోంమంత్రి అమిత్‌ షాకు లేఖ రాస్తూ, ఢిల్లీ పేరుతో పాటు ఓల్డ్‌ ఢిల్లీ రైల్వే స్టేషన్‌, అంతర్జాతీయ విమానాశ్రయం పేర్లను కూడా మార్చాలని కోరారు. పాండవుల విగ్రహాలను ఢిల్లీలో ప్రతిష్ఠించాలంటూ కూడా ఆయన డిమాండ్‌ చేశారు. హిందుత్వ సంఘాలు చెబుతున్న వాదన ఏమిటంటే - “పురానా ఖిల్లా ప్రాంతమే ఇంద్రప్రస్థ మూలస్థలం” అని. ఈ ప్రాంతంలో పాండవుల యుగానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయని, ఈ నగరం పేరు తిరిగి ఇంద్రప్రస్థగా మార్చడం ద్వారా భారత నాగరికతను గౌరవించవచ్చని అంటున్నారు.



అయితే మరోవైపు, చరిత్రకారులు మాత్రం ఈ వాదనపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. “ఇది రాజకీయ ప్రేరణతో కూడిన చర్య. చరిత్రను పేరు మార్చడం ద్వారా తిరగరాయడం సాధ్యం కాదు” అని కొందరు విమర్శకులు అంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో బీజేపీ అధికారంలో లేదు కానీ, కేంద్రంలో మాత్రం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కొనసాగుతోంది. ఇంద్రప్రస్థ పేరును అధికారికంగా ఆమోదించే నిర్ణయం వస్తే - అది దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసే అవకాశం ఉంది. మొత్తానికి - ఢిల్లీ పేరు మార్పు చర్చతో మరోసారి “హిందుత్వ–హెరిటేజ్‌ పొలిటిక్స్‌” మళ్లీ తెరపైకి వచ్చింది. దేశ రాజధాని చరిత్రలో కొత్త అధ్యాయం రాయబడుతుందా? లేక ఇది కేవలం రాజకీయ ముహూర్తం మాత్రమేనా? అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: