వైసీపీ అధినేత, మాజీ సీఎం వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి రాజకీయ వ్యూహాలు ఎప్పుడూ ఆయన ప్రత్యేక శైలిని ప్రతిబింబిస్తాయి. కూటములు, పొత్తులు అనే పదాలంటే జ‌గ‌న్‌కు ఎప్పుడూ ఆసక్తి ఉండదు. తానే పార్టీకి  శక్తివంతుడని ఆయన నమ్మకం. అందుకే 2019, 2024 ఎన్నికల్లో కూడా ఏ కూటమికి ఆయన దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు కొంత మారినట్లు కనిపిస్తున్నాయి. రాజకీయంగా ఒంటరిగా ఉండటం వల్ల ప్రభావం తగ్గుతుందని భావిస్తున్నారని, అందుకే ఆయన కొత్త రాజకీయ సమీకరణాలపై ఆలోచన చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇటీవల జడ శ్రవణ్ మొదటగా “జై భీమ్ ఫ్రంట్” ఆధ్వర్యంలో ఒక కొత్త కూటమి ఆలోచనను ప్రజల ముందుకు తెచ్చారు. ఆయన వైసీపీని కూడా ఆ కూటమిలో భాగస్వామిగా చూడాలని ప్రయత్నించారు. అయితే వైసీపీ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. అయినప్పటికీ వైసీపీ సానుభూతి పరులు, సోషల్ మీడియాలో పార్టీ అనుకూల వర్గాలు ఈ అంశంపై చర్చను వేడెక్కిస్తున్నారు.


ఈ కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ ( బీఎస్పీ ) , వామపక్షాలు , జై భీమ్ పార్టీలు ఉంటాయని ప్రచారం సాగుతోంది.అయితే ఈ పార్టీలకు ఆంధ్రప్రదేశ్‌లో ప్రాధాన్యం చాలా తక్కువ. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటివరకు ఏపీలో స‌రైన ఉనికి లేకుండా పోయింది. బీఎస్పీ కూడా చాలా పరిమిత స్థాయిలోనే ఉంది. వామపక్షాలు మాత్రం ఒకటి వైసీపీతో దూరంగా, మరొకటి కాస్త రాసుకుని పూసుకుని ఉండేలా ఉన్నాయి. జగన్ ఆలోచన మాత్రం మరో కోణంలో ఉంది. రాష్ట్రంలో ఈ పార్టీల బలం తక్కువగా ఉన్నా.. ఢిల్లీలో లేదా జాతీయ స్థాయిలో వీటి సంబంధాలు, మద్దతు ఆయనకు రాజకీయంగా ఉపయోగపడతాయని ఆయన నమ్మకం.


ప్రత్యేకంగా బీఎస్పీ లేదా ఆమ్ ఆద్మీ పార్టీలు పార్లమెంటు స్థాయిలో ప్రాధాన్యం పెంచుకుంటే, వాటి మద్దతు కేంద్రంలో కీలకం కావొచ్చు. అందుకే జగన్ ఈ తరహా కూటములకు సున్నితంగా స్పందించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే జగన్ రాజకీయ వ్యూహం ఎప్పటిలాగే ఒకే విధంగా ఉంటుంది. వారితో క‌లిసి న‌డిచినా .. వారితో సీట్లు పంచుకోవడంలో ముందడుగు వేయరు. ఈ సారి కూడా అదే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా, జగన్ “ఓ కొత్త కూటమి” ఆలోచనలో ఉన్నా, అది ఆయన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మాత్రమే ఉండే అవకాశం ఎక్కువ.

మరింత సమాచారం తెలుసుకోండి: