
రాష్ట్ర రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. మొన్నటివరకు ప్రభుత్వం-స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉప్పు-నిప్పుగా ఉన్న విషయం తెలిసిందే. మిగిలిపోయిన పరిషత్ ఎన్నికలను కూడా నిమ్మగడ్డే నిర్వహించాలని ప్రభుత్వం కోరుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. స్ధానికసంస్ధల ఎన్నికలను జరిపించాలని నిమ్మగడ్డ చేసిన ప్రయత్నాలను ప్రభుత్వం అడ్డుకుంది. అయితే న్యాయస్ధానాల జోక్యం కారణంగా ప్రభుత్వం వాదన వీగిపోవటంతో స్దానిక సంస్ధల ఎన్నికలను నిర్వహించక తప్పలేదు. సరే ఎన్నికల నిర్వహణ తర్వాతే జనాల్లో వైసీపీకి ఉన్న ఆధరణ ఏమిటనేది తేలింది. ముందు పంచాయితి ఎన్నికలు తర్వాత మున్సిపల్ ఎన్నికలను నిమ్మగడ్డ నిర్వహించారు.
వరుస ఎన్నికల్లో మిగిలిపోయిన పరిషత్ ఎన్నికలను నిమ్మగడ్డ నిర్వహిస్తారా లేదా అన్నదే సస్పన్సుగా మారింది. ఎందుకంటే ఈనెల 31వ తేదీన నిమ్మగడ్డ రిటైర్ అవుతున్నారు. 22 నుండి నిమ్మగడ్డ నాలుగు రోజులు ఎల్టీసీ శెలవుపై వెళుతున్నారు. తిరిగి వచ్చిన తర్వాత పరిషత్ ఎన్నికల నిర్వహణకు సరపడ వ్యవధి ఉండదని కమీషనర్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే జగన్మోహన్ రెడ్డి+ పంచాయితి రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతు మిగిలిపోయిన పరిషత్ ఎన్నికలను కూడా నిమ్మగడ్డే నిర్వహించాలని కోరారు. పరిషత్ ఎన్నికల నిర్వహణకు ఆరు రోజులు సరిపోతుందని కూడా వీళ్ళంటున్నారు.
అంటే నిమ్మగడ్డ ఎల్టీసీ శెలవు నుండి వచ్చిన తర్వాత కూడా పరిషత్ ఎన్నికలు జరిపించేయచ్చని జగన్ సూచించారు. ఒకపుడు నిమ్మగడ్డ అవునంటే ప్రభుత్వం కాదన్నది. అలాగే ప్రభుత్వం అవునంటే నిమ్మగడ్డ కాదన్నారు. అలాంటిది పరిషత్ ఎన్నికలను నిమ్మగడ్డే జరిపించాలని ప్రభుత్వం కోరటమంటే విచిత్రంగానే ఉంది. ప్రభుత్వం కాదన్నా నిమ్మగడ్డ పట్టుబట్టి మరీ పంచాయితి, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించారు. బహుశా అధికారపార్టీకి ఈ స్ధాయిలో సానుకూల ఫలితాలు వస్తాయని అనుకునుండరనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే మొదటినుండి నిమ్మగడ్డ అంటే చంద్రబాబునాయుడు మనిషిగా ముద్రపడిపోయింది. ఇపుడు మిగిలిపోయిన పరిషత్ ఎన్నికలను నిర్వహించేస్తే ఇందులో కూడా టీడీపీ తలబొప్పి కట్టడం ఖాయమని అర్ధమైపోయింది. ఈ కారణంతోనే పరిషత్ ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డ పెద్దగా ఆసక్తి చూపటం లేదనే ప్రచారం జరుగుతోంది.