
వేదాలు హిందూ జీవన విధాన ప్రదాతలు. కాలాంతరంలో యోగిపుంగవులనేకులు అందించిన జ్ఞాన విజ్ఞాన భావాలను విజ్ఞాన ఆ భాండాగారాలను, వేద భావాలను శిష్య పరంపర ద్వారా తరతాలుగా హిందూ మానవాళికి అందిస్తూవస్తున్నారు. ఆ విజ్ఞాన భాండాగారం తరగని గని. హిందూత్వాన్ని ఒక జీవన విధానం గా మార్చిగా అది ఎవరైనా అనుసరించ దగినదిగా మారిపోయింది. వేద వాఙ్ఞయం హైందవ ధర్మానికి మూలం.
ప్రపంచ వాఙ్మయరంగంలో ప్రప్రథమ స్థానాన్ని అలంకరించి, తత్త్వ భాండాగారాలుగా ప్రసిద్ధి చెందిన వేదాలను దర్శించింది భారతదేశం. వేదాలు హిందువులకు అతి పవిత్రమైన గ్రంథాలు. దేని ద్వారా జ్ఞానం ప్రాప్తిస్తుందో దానినే వేదమని అన్నారు. వేదాలు మానవజాతి చరిత్రకు మొట్టమొదటి పాఠ్యగ్రంథాలు.
వేదాలు అపౌరుషేయాలు. అంటే పురుష ప్రమేయం లేనివి అని అర్థం. 'పౌరుషేయ' మంటే మానవ కల్పితం. వేదాలు మానవ కల్పితం కానందువల్ల ఏ ఋషీ వాటిని రచించలేదు. వారే వ్రాసి వుంటే మంత్ర కర్తలనేవారు. కాని వారిని మంత్ర దష్టలంటున్నారు. అంటే మంత్రాలను దర్శించిన వారని అర్థం. తపో సంపన్నులైన ప్రాచీన మహర్షులు జ్ఞానాన్ని స్వానుభవ పూర్వకముగా దర్శించి, శిష్య పరంపరగా లోకానికి అదించారు. విస్తృతమైన వేద సంహితాన్ని వ్యాసుడు నాలుగు భాగాలుగా విభజించాడు.
*బాహ్యదృష్టిలోని అందచందాలను-అంతరదృష్టి తో అవగాహన చేసుకుని వాటి ఆంతర్యాన్ని అనురాగంతో కీర్తించిన ఆనందగీతికలు ఋగ్వేదంలోని ఋక్కులయితే,
*గృహమేదికి కావలసిన గృహ్యసూత్రాలు, యజ్ఞయాగాదులు, కర్మకాండలకు సంబంధించిన మంత్రాలు యజుర్వేదంలో చేరాయి.
*పాడుకొని కొనియాడదగిన పరమ రమణీయ పద సంపద సామగానమయితే,
*ఐహికాముష్మిక రహస్య సంపుటి అథర్వ రూపాన్ని ధరించింది.
ప్రతీ వేదశాఖకు ప్రత్యేకంగా:
సంహిత,
బ్రాహ్మణము,
అరణ్యకము,
ఉపనిషత్తులు,
ప్రాతిశాఖ్యములు,
శ్రౌత సూత్రములు,
గృహ్యసూత్రములు
మొదలైన వాఙ్మయముంటుంది. కాని నేడు మనకు ఋగ్వేద శాఖ ఒకటి, యజుర్వేద శాఖలు అయిదు, సామవేద శాఖలు మూడు, అథర్వవేద శాఖలు రెండు - మొత్తం పదకొండు శాఖలు మాత్రమే మిగిలాయి.