యూపీలోని అలీఘర్‌లో ఓ విచిత్రమైన, షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కూతురు చేసుకోవాల్సిన అబ్బాయిని ఆమె తల్లి లైన్ లో పెట్టింది. ఆమె ఏజ్ 39 ఏళ్లు. ఆమె ఆ పెళ్లి కొడుకుతో లేచిపోయింది. పెళ్లికి వారం రోజుల ముందు జరిగిన ఈ ఊహించని పరిణామం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యి, అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. తల్లి పేరు సప్న (కొన్ని నివేదికల్లో అప్నా దేవి), కాబోయే అల్లుడు పేరు రాహుల్ (25).

పది రోజుల పాటు వీరి కోసం వెతికిన తర్వాత, బుధవారం సప్న, రాహుల్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. అయితే, పోలీసులు మాత్రం తామే అరెస్ట్ చేశామని చెబుతుండగా, సప్న, రాహుల్ మాత్రం స్వచ్ఛందంగా పోలీసు స్టేషన్‌కు వచ్చామని స్పష్టం చేశారు.

"నేను రాహుల్ ని ప్రేమిస్తున్నాను.. అతనితోనే ఉంటా"

ఈ ఘటనపై సప్న మీడియాతో చాలా ధీమాగా మాట్లాడింది. తాను రాహుల్ ని ప్రేమిస్తున్నానని, అతనితోనే ఉండాలని కోరుకుంటున్నానని, అతన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. అంతేకాదు, తాను ఇల్లు వదిలి వెళ్లేటప్పుడు ఎలాంటి డబ్బు, నగలు తీసుకెళ్లలేదని తెలిపింది.

అయితే, సప్న భర్త జితేంద్ర కుమార్ మాత్రం మరో కథ చెప్పాడు. కూతురు పెళ్లి ఏప్రిల్ 16న జరగాల్సి ఉందని, దాని కోసం దాచి ఉంచిన రూ.3 లక్షల నగదు, రూ.5 లక్షలకు పైగా విలువైన నగలు తీసుకొని భార్య పారిపోయిందని తీవ్రంగా ఆరోపించాడు. గత కొన్ని నెలలుగా తన భార్య, రాహుల్ గంటల తరబడి ఫోన్ లో మాట్లాడుకునేవారని, అయితే ఇది ఇంత దూరం వస్తుందని కలలో కూడా ఊహించలేదని వాపోయాడు. ఈ సంఘటన తమ కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేసిందని కన్నీటి పర్యంతమయ్యాడు.

మరోవైపు, సప్న తన భర్త జితేంద్ర కుమార్ పై సంచలన ఆరోపణలు చేసింది. అతను తనను శారీరకంగా హింసించాడని, తన శీలాన్ని శంకించి, నీకు దమ్ముంటే రాహుల్ తో లేచిపొమ్మని సవాల్ చేశాడని, అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని వివరణ ఇచ్చింది. ఇల్లు వదిలిన తర్వాత ఈ జంట మొదట బీహార్ లోని సీతామర్హిలో ఒక హోటల్ లో బస చేశారు. ఆ తర్వాత నేపాల్ సరిహద్దు వరకు కూడా వెళ్ళి, చివరికి తిరిగి వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయారు.

ఈ కథలో మరో ఆసక్తికరమైన ట్విస్ట్ ఏంటంటే... రాహుల్ ఇలా ఎవరితోనో లేచిపోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అతను పక్క గ్రామానికి చెందిన మరో మహిళతో లేచిపోయాడని, రెండు నెలల తర్వాత తిరిగి వచ్చినా, ఆ మహిళ కుటుంబం మాత్రం ఎలాంటి పోలీసు ఫిర్యాదు చేయలేదని డెక్కన్ హెరాల్డ్ నివేదిక వెల్లడించింది.

మొత్తం మీద ఈ విచిత్రమైన ప్రేమకథ ఇప్పుడు ఇంటర్నెట్ లో ఓ రేంజ్ లో ట్రెండింగ్ అవుతోంది. నమ్మకం, కుటుంబ బంధాలు, సంబంధాలపై ఈ ఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తుతూ హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: