తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది. స్వ‌ల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో గురువారం పరీక్షలు చేయించగా కోవిడ్ సోకినట్లు నిర్దారణైంద‌ని ఎమ్మెల్యే వెల్ల‌డించారు. తన స్నేహితుల ద్వారా కరోనా సోకిన‌ట్లు ఎమ్మెల్యే గుర్తించారు. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, వైద్యుల సూచన మేరకు హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు చెప్పారు. పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు ఎవరూ తనను కలవడానికి రావద్దని కోరారు. అంబేద్కర్ జయంతి సంద‌ర్భంగా తాండూరు పర్యటనలో తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రెండోద‌శ‌లో క‌రోనా ఉధృతంగా విస్త‌రిస్తుండ‌టంతో అందరూ మాస్కులు ధరించాల‌ని, కొవిడ్ నిబంధన‌లు పాటించాల‌ని రోహిత్‌రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. క‌రోనా విజృంభ‌ణ‌ను దృష్టిలో ఉంచుకునే తెలంగాణ స‌ర్కారు ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ఈ ఏడాది కూడా ర‌ద్దుచేసింది. మ‌రో నాలుగువారాల‌పాటు ఈ ఉధృతి ఇలాగే కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని వైద్య‌నిపుణులు చెపుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: