చెమటోడ్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతన్న కుదేలవుతున్నాడు.  రైతు ఇంట సిరులు కురిపిస్తుంది అనుకున్న టమాట వారి కంట కన్నీరు తెప్పిస్తోంది. కర్నూలు జిల్లాలో బహిరంగ మార్కెట్ లో నిన్న మొన్నటి వరకు కొనుగోలుదారులకు చుక్కలు చూపించిన టమోటా ధరలు... ఒక్కసారిగా పతనమయ్యాయి. 


కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ లో టమోటా ధర దారుణంగా పడిపోయింది. ఎండనక వాననక శ్రమించి పండించిన టమోటాకు ధర లేక రైతులు డీలా పడిపోయారు . మార్కెట్ లో కిలో టమోటా  రూపాయికి పడిపోవడంతో.... రైతులు పంటను రోడ్డుపై పారబోస్తున్నారు. రవాణా చార్జీలు కూడా రాకపోవడంతో మార్కెట్ కు తీసుకెళ్లి ఏం లాభమని రైతులు వాపోతున్నారు.


రేటు దారుణంగా పడిపోవడంతో.. కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొందని అంటున్నారు.  చేసేదేమి లేక కొందరు రైతులు టమోటాలను పంట పొలంలోనే వదిలేస్తున్నారు. దళారులంతా  ఏకమై తమ దగ్గర తక్కువ ధరకు కొని లారీలతో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసి  లాభాలు పొందుతున్నారని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జ్యూస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి టమోటా రైతులను ఆదుకోవాలని కర్నూలు వాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. జ్యూస్ ఫ్యాక్టరీ వల్ల ఉపాధి దొరకడంతో పాటు..  రైతులకు మద్దతు ధర లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: