పొత్తుల ఖరారు, సీట్ల పంపకం, అభ్యర్థుల ఎంపికతో తీరిక లేకుండా గడిపిన చంద్రబాబు మళ్లీ ప్రజా క్షేత్రంలోకి అడుగు పెట్టారు. ఎన్నికలకు 50 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రచారంలో వేగం పెంచారు. ప్రజాగళం పేరిట రోజుకు రెండు నుంచి మూడు నియోజకవర్గాలు చుట్టి వచ్చేలా కార్యచరణ సిద్ధం చేసుకున్నారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే గాక.. ప్రజాకర్షక పథకాలను ప్రకటించనున్నారు.


పలమనేరు నుంచి ఆయన పరట్యన ప్రారంభం అయింది. దీంతో ఇక ప్రచారంలో దూసుకుపోతున్నారు అనే సంకేతాలు ప్రత్యర్థి వర్గాలకు పంపించారు. ఇప్పటికే బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ, రా కదిలిరా పేరిట రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించిన చంద్రబాబు ఇక మలివిడత ప్రచారం ప్రారంభించారు. తొలిరోజు పలమనేరుతో పాటు పుత్తూరు, మదనపల్లెలో చంద్రబాబు పర్యటన సాగింది. ఈ సందర్భంగా ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమే ఈ సారి ఎన్నికల్లో విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు.


160 అసెంబ్లీ స్థానాలతో పాటు 24 ఎంపీ సీట్లు గెలుస్తామంటూ చంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  భారత దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నరేంద్ర మోదీ చేశారు. ఆయన పెట్టుకున్న 400 ఎంపీ సీట్ల లక్ష్య సాధనకు మనం కూడా కృషి చేయాలని అని ప్రజలకు పిలుపునిస్తున్నారు. వై నాట్ పులివెందుల అనేదే తన నినాదమని.. అంటూ తుది విడత ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు.


తొలి విడత షెడ్యూల్ ఈ నెల 31 వరకు సిద్ధం చేశారు. ఇప్పటికే సూపర్ సిక్స్ మిని మ్యానిఫెస్టోతో పథకాలకు అదనంగా, పింఛన్ రూ.4వేలకు పెంచుతామని టీడీపీ అధినేత ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రజాగళంలో మరిన్ని హామీలు ఇచ్చేలా ఆయన వ్యూహ రచన చేస్తున్నారు. ఏడు పదుల వయసులోను ఎండను సైతం లెక్కచేయకుండా రోజుకు మూడు సభలకు తగ్గకుండా ప్రచారంలో పాల్గొంటూ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కష్టపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: