ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య వైరం ఈనాటిది కాదు.. శతాబ్దాల నుంచి ఉంది. అయితే ఈ యుద్ధం వార్తల కవరేజీలో పక్షపాతం ఉందంటున్నారు ఎన్నారై ప్రసాద్ చెరసాల. ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధం వార్తలు ఎలా వస్తాయి.. వాటిని ఎలా అర్థం చేసుకోవాలో ఆయన ఫేస్‌బుక్‌లో ఓ ఇంట్రస్టింగ్ పోస్టు పెట్టారు. చదవండి.

ఇజ్రాయెల్ దాష్టీకం by prasad Charasala
---------------------
ఇజ్రాయెల్ పాలస్తీనా పౌరులపై దాడి, ఇంతమంది మరణం అన్నప్పుడల్లా మన మీడియానే కాదు అంతర్జాతీయ మీడియా కూడా ఆ వార్తను ఇలా మొదలెడుతుంది.
"పాలస్తీనా మిలిటెంట్లు సోమవారం రాత్రి జెరూసలెంపై కొన్ని రాకెట్లు ప్రయోగించడంతో అక్కడ హింస చెలరేగింది.
ఇజ్రాయెల్ సైన్యం దీనికి ప్రతీకారంగా గాజా స్ట్రిప్‌లోని చాలా మిలిటెంట్ స్థావరాలపై వైమానిక దాడులు జరిపింది."
కావాలంటే మే 11, 2021నాటి బీబీసీ తెలుగు వార్త "జెరూసలెంలో హింస: హమాస్ బెదిరింపులతో ఇజ్రాయెల్ వైమానిక దాడులు, భారీగా మృతులు" చూడండి.

వార్త ఎంత ఏకపక్షమో వార్త టైటిల్ బట్టే అర్థం అవుతుంది. సామాన్యపాఠకుడు ఇలా అర్థం చేసుకుంటాడు.
1.హమాస్ బెదిరించింది.
2.ప్రతీకారంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది.
ఇక వార్తలోపలి సందేశం కూడా దాన్నే ధృవపరుస్తుంది.
1.పాలస్తీనా మిలిటెంట్లు సోమవారం రాత్రి జెరూసలెంపై కొన్ని రాకెట్లు ప్రయోగించారు.
2.ఇజ్రాయెల్ సైన్యం దీనికి ప్రతీకారంగా గాజా స్ట్రిప్‌లోని చాలా మిలిటెంట్ స్థావరాలపై వైమానిక దాడులు జరిపింది.
చెల్లుకు చెల్లు.


కానీ సత్యం ఇది కాదు. పాలస్తీనా మిలిటెంట్లు తిన్నది అరక్క రాకెట్లు ప్రయోగించలేదు. వాళ్ళు రాకెట్లు ప్రయోగించగానే అత్యంత శక్తిమంతమైన ఇజ్రాయెలీ సైన్యం వెంటనే దాడికి దిగి అంతకు వంద రెట్లు నష్టం చేస్తుందనీ వాళ్ళకూ తెలుసు. అయినా ఎందుకు చేస్తున్నారు?

మీరు నిజంగా తెలుసుకోవాలనుకుంటే 1967 యుద్దంలో ఇజ్రాయెల్ ఆక్రమించిన వెస్ట్‌బ్యాంక్‌లో, తూర్పు జెరూసలెంలో అక్కడ ఎన్నో ఏళ్ళుగా స్థిర నివాసం వున్న అరబ్బులను వెళ్ళగొట్టి కేవలం యూదులు అయిన కారణంగా అవే యిళ్ళను యూదులకు ఎలా కేటాయిస్తూ వుందో, తిరగబడిన అరబ్బులను ఎలా బలప్రయోగంతో ఈడ్చి అవతల పారేస్తూ వుందో తెలుసుకోండి. ఇది అచ్చం మన బాబ్రీ వివాదంలాగే అనిపించకపోదు. అక్కడ ఎన్నో ఏళ్ళ నుండీ అరబ్బులు నివాసం వుంటూ వుంటారు. ఏదో యూదు సంఘం వాళ్ళు అది పూర్వం ఒక యూదుల నివాసస్థలం అని వాదిస్తూ కోర్టులో కేసు వేస్తారు. దానికి ఋజువుగా అట్టోమాన్ కాలమునాటివో అంతకు పూర్వమువో అంటూ ఏవో ఆధారాలు సపర్పిస్తారు. షరా మామూలుగా అరబ్బుల లాయర్ అవి ఫేక్ అంటారు, యూదుల లాయర్ అవి సరైనవే అంటాడు. కోర్టు ఇజ్రాయెలీ కోర్టే కదా, అవి సరైనవే అంటూ ఇల్లు ఖాళీ చేయమని ఆదేశాలు ఇస్తుంది. (ఈ తతంగమంతా ఏవో కొద్ది కేసుల్లోనే, ఎక్కువ భాగం ఇజ్రాయెలీ సైనికులు వచ్చి అరబ్బులను మెడపట్టి గెంటడంతో పూర్తి అవుతుంది.)
(మరిన్ని వివరాలకు My Neighbourhood అనే డాక్యుమెంటరీ చూడండి.)


ఇలా అరబ్బులను వెళ్ళగొట్టి ఆ స్థానాల్లో తిష్టవేసిన యూదులను సెటిలర్స్ అంటారు. వీళ్ళకు ఇజ్రాయెలీ పౌర చట్టాలే వర్తిస్తాయి. అదే ప్రాంతంలో వున్న అరబ్బులకు మాత్రం ఇజ్రాయెలీల సైనిక చట్టం వర్తిస్తుంది. అంటే ఒకే ప్రాంతంలో రెండు చట్టాలన్నమాట!


ఇప్పుడీ వివాదం ఎలా రాజుకుందీ అంటే కొన్ని ఏళ్ళుగా షేక్ జరా ప్రాంతంలో అరబ్బులను వాళ్ళ ఇళ్ళనుండీ వెళ్ళగొడుతూ వాటిని సెటిలర్స్‌కు ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఓ కేసులో కోర్టు తీర్పు రాబోతూ వుంది. మన బాబ్రీ తీర్పులాగే అది వుండబోతోందని వుప్పందింది. దాంతో ఇజ్రాయెల్ లోని లెఫ్ట్, ఇటు పాలస్తీనా అరబ్బులు ప్రతిఘటనకు దిగారు.

దీంతోపాటు తూర్పు జెరూసలెంను ఆక్రమించిన దానికి గుర్తుగా ఇజ్రాయేలీలు సోమవారంను జెరూసలెం డేగా పాటిస్తారు. ఆరోజు రైటిస్ట్ జాతీయవాదులు పాత జెరూసలేం నుండి వూరేగింపు చేస్తారు. ఈ సందర్భంగా ఇజ్రాయేలీ పోలీసులు రంజాన్ ప్రార్థనల కోసం గుమిగూడిన అరబ్బులను చెదరగొట్టి, భాష్పవాయువు ప్రయోగించి మరీ యూదుల ప్రదర్షనకు అనుమతించింది. అలా రాజుకుంది నిప్పు.

-  Prasad Charasala


మరింత సమాచారం తెలుసుకోండి: