ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కుల సమీకరణాలకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఈ విషయం బహిరంగ రహస్యమే.. 40 ఏళ్ల సీనియర్‌ను అని చెప్పుకునే చంద్రబాబు కూడా జగన్‌ను ఓడించేందుకు తప్పనిసరిగా పొత్తుల కోసం వెళ్లింది ఈ కుల సమీకరణాల ఆధారంగానే. ఏపీలో కాపుల ఓట్లు చాలా కీలకం అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కాపుల ఓట్ల కోసమే చంద్రబాబు పవన్ కల్యాణ్‌ తో పొత్తు పెట్టుకున్నారు.


అటు పవన్‌ కల్యాణ్‌ కూడా పార్టీ పెట్టి పదేళ్లయినా ఇంకా ఈ మాత్రం క్రేజ్‌ ఉందంటే.. అది ఆయన  కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అవ్వడం వల్లనే అని చెప్పడం అతిశయోక్తి ఏమీ కాదు. పవన్ కల్యాణ్‌ ఒక్కటే కాపుల ప్రతినిధి కాకపోయినా.. కాపులు చాలా వరకూ పవన్‌ను తమ నేతగా భావిస్తారని చెప్పుకోవచ్చు. జనాభాలో గణనీయ సంఖ్యలో ఉన్న తమ కులానికి కీలక పదవులు దక్కలేదన్న కాపు జనం ఆక్రోశమే.. వారిని పవన్ వైపు మొగ్గేలా చేస్తోంది.


మరి ఇంతటి కీలకమైన స్థానం ఉన్న కాపులను ఈసారి ఎందుకు బీజేపీ నిర్లక్ష్యం చేస్తోందన్నది అర్థంకాని ప్రశ్నలా మారింది. కాపులకు ఒక్క ఎంపీ సీటు గానీ, ఎమ్మెల్యే సీటు గానీ ఇవ్వకుండా ఈసారి బీజేపీ పూర్తిగా దూరం పెట్టడం ఆసక్తిదాయకంగా మారింది. అలాగని బీజేపీ మొదటి నుంచి కాపులను దూరం పెట్టిన పార్టీ ఏమీ కాదు. అంతేకాదు.. నిన్న మొన్నటి వరకూ ఏపీ బీజేపీలో కాపు నాయకులకే నాయకత్వం కూడా లభించింది.


పురందేశ్వరికి ముందు ఏపీ బీజేపీ అధ్యక్షులైన కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు వంటి వారు కాపు నాయకులే. కాపులు అవ్వడం వల్లే వారికి ఆ పదవులు దక్కాయన్నదీ బహిరంగ రహస్యమే. మరి అలాంటిది ఈ ఎన్నికల్లో మాత్రం కాపులను ఎందుకు పూర్తిగా పక్కకు పెట్టేసిందన్నది అర్థం కాని విషయమే. అందులోనూ బీజేపీకి గతంలో ఏ ఎన్నికల్లోనూ దక్కనన్ని సీట్లు ఇప్పుడు పొత్తులో దక్కాయి. గట్టిగా కష్టపడితే గతంలో ఏపీలో ఎప్పుడూ దక్కనన్ని అసెంబ్లీ, లోక్‌సభ సీట్లు గెలిచే అవకాశమూ ఉంది. మరి ఇలాంటి కీలక సమయంలో బీజేపీ కాపుల్లో ఒక్కరికీ కూడా ఎందుకు సీటు ఇవ్వలేదన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

bjp