రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండటంతో వివిధ నియోజకవర్గాల్లో పారాచూట్ నేతలు దిగిపోయారు. దీంతో ఆయా పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయాలతో ఎలాంటి సంబంధాలు లేకపోయినా.. ఎక్కడ నుంచో ఉన్నట్టుండి నియోజకవర్గాలతో దిగిన వారితో స్థానిక నేతలకు, మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్న వారికి పొసగడం లేదు. పైగా ఈ పారాచూట్ నేతలకు ఉన్న ధనబలం, హంగు ఆర్భాటాలకే ఆయా పార్టీల అధినేతలు ప్రాధాన్యం ఇస్తున్నారు.


సహజంగా ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి వచ్చే వారిని జంపింగ్ జిలానీలు అంటారు. కానీ ఇప్పుడు పారాచూట్ బ్యాచ్ అనే పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.  అంటే ఎన్నారైలు.  స్థానికంగా తల్లిదండ్రుల కష్టం మీద విదేశాలకు వెళ్లి బాగా చదువుకొని.. అక్కడ వ్యాపారాలు చేపట్టి బాగా సంపాదించిన తర్వాత సుమారు రెండు మూడు తరాలకు సరిపోయేంత సంపాదించిన తర్వాత తిరిగి జన్మభూమికి వస్తున్నారు. వీరంతా రాజకీయాల్లో రాణించాలనే కోరికతో పార్టీలకు ఫండింగ్ ఇచ్చి సీట్లు దక్కించుకుంటున్నారు.


దీంతో వీరికి స్థానిక నేతల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. ఇలాంటి వారు ఎక్కువగా టీడీపీలోనే ఉన్నారు. కృష్ణాజిల్లా గుడివాడ ఇన్ ఛార్జిని చూసుకుంటే ఎన్ఆర్ఐ వెనిగళ్ల రాముని నియమించారు. దీంతో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న రావి వెంకటేశ్వరరావు వర్గం ఆగ్రహంతో ఉంది. గుంటూరు ఎంపీ సీటు రేసులో ఎన్ఆర్ఐ సాని చంద్రశేఖర్ ని రంగంలోకి దింపడం స్థానిక నేతలకు రుచించడం లేదు.


మరోవైపు ఏలూరు జిల్లా చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా ఎన్ ఆర్ ఐ రోషన్ ను నియమించడంతో ఆ సీటుపై గంపెడాశలు పెట్టుకున్న టీడీపీ నేతలు భగ్గు మంటున్నారు.  మొత్తంగా చూసుకుంటే రూ.50-100 కోట్లు ఖర్చు పెట్టేవారికే చంద్రబాబు సీట్లు ఇచ్చినట్లు అర్థం అవుతోంది. వీరితో పాటు జంపింగ్ జిలానీలకు సీట్లు కేటాయించారు. దీంతో పార్టీ క్యాడర్ లో గందరగోళం నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: