
విషయంలోకి వెళ్తే, ఈ ట్రిపనోఫోబియా అనే సూది భయం ఎంతో మందిని వేధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో సగం మందికి, పెద్దల్లో దాదాపు మూడో వంతు మందికి ఈ భయం ఉంది. ఇంజెక్షన్ అంటేనే వణికిపోయే ఈ జనాభా కోసమే, బెంగళూరుకు చెందిన ఇంటెగ్రీ మెడికల్ అనే సంస్థ ఒక సంచలన ఆవిష్కరణ చేసింది. 'ఎన్‌ఫిన్' పేరుతో సూది లేని ఇంజెక్షన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఇది మామూలు ఇంజెక్షన్ కాదు, టెక్నాలజీతో చేసిన మ్యాజిక్.
ఈ పరికరం ఎలా పనిచేస్తుందంటే, సూది గుచ్చకుండానే, ఔషధాన్ని రాకెట్ వేగంతో చర్మ రంధ్రాల్లోకి పంపిస్తుంది. అసలు గుచ్చినట్టు కూడా తెలియదంట. నొప్పి అనే మాటకే అర్థం లేకుండా, మందు కండరాల్లోకి చొచ్చుకుపోతుంది. ఇప్పటికే దేశంలో వెయ్యి మందికి పైగా డాక్టర్లు దీన్ని ప్రయోగాత్మకంగా వాడుతున్నారంటే, దీని పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
టీకాలు తయారు చేసే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో కూడా ఈ సంస్థ చేతులు కలిపింది. అంటే, ఇకపై టీకాలు కూడా సూది లేకుండానే వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు, ఇంజెక్షన్ అంటే భయపడే ప్రతి ఒక్కరికీ ఇది నిజంగా శుభవార్తే.
చూస్తుంటే, భవిష్యత్తులో సూదులు మ్యూజియంలో పెట్టే రోజులు వచ్చేలా ఉన్నాయి. ఈ 'ఎన్‌ఫిన్' లాంటి టెక్నాలజీతో, వైద్య రంగంలో విప్లవం రావడం ఖాయం. నొప్పి లేని చికిత్స, భయం లేని వైద్యం... ఇదే కదా అందరం కోరుకునేది. ఇంటెగ్రీ మెడికల్ సంస్థ చేసిన ఈ అద్భుత ఆవిష్కరణతో, వైద్యం మరింత సులభం, మరింత సౌకర్యవంతం కానుంది. ఇంజెక్షన్ అంటే భయపడే రోజులకు గుడ్‌బై చెప్పేయండి.