
ముఖ్యంగా జలుబు, దగ్గు, తుమ్ములు, గొంతు నొప్పి, కళ్ళు ఎర్రగా మారడం, నీరసం, హై ఫీవర్, చెమటలు పట్టడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిలో డాక్టర్లు వైరల్ ఫీవర్స్ నుంచి రక్షించుకోవడానికి కొన్ని సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా, మారిన క్లైమేట్‌కి చల్లని నీరు, కూల్ డ్రింక్స్ తాగకపోవడం మంచిదని చెబుతున్నారు. వీలైతే కాచి చల్లార్చిన నీళ్లు లేదా గోరువెచ్చని నీళ్లు క్రమం తప్పకుండా తాగడం ఉత్తమం. చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా కాచి చల్లార్చిన నీళ్లు మాత్రమే తాగాలి. బయటకు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్‌లో గోరువెచ్చని నీళ్లు తీసుకెళ్లడం మంచిది.
తీసుకునే ఆహారం హెల్తీగా ఉండాలి. ఈ వర్షాకాలంలో వేడిగా తినాలనిపిస్తుందని, రోడ్డు పక్కన దొరికే బజ్జి, బోండాలు తినకుండా.. ఇంట్లోనే సూప్ వంటి వాటిని తయారు చేసుకుని తీసుకోవడం మంచిది. పిల్లలకు పాలు తాపించే వారు, కొద్దిగా పసుపు, మిరియాల పొడి వేసి ఇవ్వడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. జలుబు, దగ్గు తగ్గుతాయి. రోడ్డు పక్కన దొరికే ఆహారాన్ని ఈ కాలంలో మానేయడం మంచిది. వంటల్లో పసుపు, మిరియాల పొడి, అల్లం, జీలకర్ర,ధనియాలు వాడటం ఆరోగ్యానికి మంచిది. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించడం.. చేతులు శుభ్రం చేసుకోవడం తప్పనిసరి. ఇలా చేస్తే వైరల్ ఫీవర్స్ వ్యాప్తిని చాలా వరకు అరికట్టవచ్చు అంటున్నారు డాక్టర్లు..!!