
వెనిగర్ బొద్దింకలను తరిమికొట్టడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఒక స్ప్రే బాటిల్‌లో సమాన మొత్తంలో వెనిగర్, నీరు కలిపి బొద్దింకలు ఎక్కువగా కనిపించే ప్రదేశాల్లో స్ప్రే చేయండి. దీని ఘాటైన వాసన వాటిని దూరం చేస్తుంది. బొరాక్స్ పొడి, పంచదార పొడిని సమపాళ్లలో కలిపి బొద్దింకలు తిరిగే మూలల్లో చల్లండి. పంచదార వాసనకు ఆకర్షించబడిన బొద్దింకలు బొరాక్స్‌ను తిని చనిపోతాయి. అయితే, ఇంట్లో పెంపుడు జంతువులు లేదా చిన్నపిల్లలు ఉంటే ఈ చిట్కా పాటించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
బేకింగ్ సోడా, పంచదార మిశ్రమం కూడా బాగా పనిచేస్తుంది. బొద్దింకలు తిరిగే చోట ఈ మిశ్రమాన్ని చల్లండి. ఈ మిశ్రమాన్ని తిన్న బొద్దింకల కడుపులో గ్యాస్ ఏర్పడి చనిపోతాయి. లవంగాలు లేదా మిరియాల ఘాటైన వాసన బొద్దింకలకు నచ్చదు. వాటిని ఇంట్లో మూలల్లో, ముఖ్యంగా కిచెన్‌లో పెడితే బొద్దింకలు రాకుండా ఉంటాయి.
బోరిక్ ఆమ్లం బొద్దింకలను చంపే శక్తివంతమైన రసాయనం. దీన్ని గోధుమ పిండి, పంచదారతో కలిపి చిన్న చిన్న ఉండలు చేసి బొద్దింకలు తిరిగే చోట పెట్టండి. ఈ ఉండలను తిన్న బొద్దింకలు చనిపోతాయి. దీన్ని వాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ చిట్కాలను పాటిస్తే మీ ఇంట్లో బొద్దింకల బెడద నుంచి సులభంగా బయటపడవచ్చు. అంతేకాకుండా, ఆహార పదార్థాలను జాగ్రత్తగా ఉంచడం, ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం వంటివి చేయడం వల్ల బొద్దింకలు రాకుండా ముందుగానే నివారించవచ్చు.