టాలీవుడ్‌లో యంగ్ హీరోలు ఎప్పుడు కెమెరాల ముందుకు వచ్చినా పెళ్లి ఎప్పుడనే ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. సినిమా విడుదల ముందు అయినా, సక్సెస్‌ సెలబ్రేషన్స్ అయినా మైకులన్నీ పెళ్లి గురించి అడుగుతూనే ఉంటాయి. ఈ ప్రశ్నలతో విసిగిపోయిన యంగ్‌స్టర్స్ చాలామంది ఈ ఏడాది పెళ్లి పీటలెక్కడానికి రెడీ అయిపోయారు.  

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ తర్వాత టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌ లిస్ట్‌లో ముందున్న హీరో శర్వానంద్. 37 ఏళ్ల వయసులో ఉన్న ఈ హీరో పెళ్లి అనే మాటకే దూరంగా ఉన్నాడు. అయితే 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాలో మాత్రం పెళ్లి కోసం పరితపించే బ్రహ్మచారి పాత్ర పోషించాడు. కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మార్చి 4న విడుదల అవుతోంది. విశ్వక్‌ సేన్‌ నిన్న ప్రేమకోసం 'పాగల్' అయిపోతే ఇప్పుడు పెళ్లి కోసం పోరాటం చేస్తున్నాడు. పైన బట్ట, కింద పొట్టతో పెళ్లి కోసం తపించే అర్జున్‌లా మారిపోయాడు. విద్యాసాగర్‌ దర్శకత్వంలో 'అశోకవనంలో అర్జున కళ్యాణం' అనే సినిమా చేస్తున్నాడు. ఇక విశ్వక్‌ సేన్‌ పెళ్లి కూడా శర్వానంద్ పెళ్లి కథతో పాటే మార్చి 4న విడుదలవుతోంది.

యూనిక్‌ కామెడీ టైమింగ్‌తో బ్లాక్‌బస్టర్‌ రెస్పాన్స్ తెచ్చుకుంటోన్న హీరో నవీన్‌ పోలిశెట్టి. 'జాతిరత్నాలు' సినిమాతో హిలేరియస్‌ హిట్‌ కొట్టిన నవీన్‌ పోలిశెట్టి ఇప్పుడు 'అనగనగా ఒక రాజు' అనే సినిమా చేస్తున్నాడు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రాజుగాడి పెళ్లికథగా వస్తోందీ ఈ సినిమా. రాజుగాడి పెళ్లి హంగామా మొదలు అని నవీన్‌ పోలిశెట్టి ఒక టీజర్ కూడా రిలీజ్ చేశాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్‌ హీరోగా లాంచ్ అవుతోన్న సినిమా 'స్వాతిముత్యం'. లక్ష్మణ్ క్రిష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ 'స్వాతిముత్యం' కథ మొత్తం పెళ్లి చుట్టూనే తిరుగుతోంది. మరి పెళ్లి కథలతో వస్తోన్న ఈ యంగ్‌స్టర్స్‌లో బాక్సాఫీస్‌ ఎవరెవరికి ఎంతెంత చదివింపులు చదివిస్తుందో చూడాలి.

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా వస్తోన్న 'ఎఫ్-3' సినిమా కూడా పెళ్లి కథతోనే తెరకెక్కుతోంది. 'ఎఫ్-2'లో భార్యాబాధితులని చూపించిన అనిల్‌ రావిపూడి, ఈ పెళ్లికథకి సీక్వెల్‌గా వస్తోన్న 'ఎఫ్-3'లో ఎక్స్‌ట్రాగా మనీ కష్టాలని చూపించబోతున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: