- పామ‌ర్రు, నందిగామ‌లో పాత ప్ర‌త్య‌ర్థుల పోటీ
- తిరువూరులో వైసీపీ స్వామిదాసుతో టీడీపీ కొలిక‌పూడి ఢీ
- టీడీపీ కంచుకోట కృష్ణాలో రిజ‌ర్వ్‌డ్ సెగ్మెంట్ల‌లో ఏటికి ఎదురీతేనా ?

( విజ‌య‌వాడ‌ - ఇండియా హెరాల్డ్ )

ఉమ్మడి కృష్ణాజిల్లాలో పామర్రు, నందిగామ, తిరువూరు రిజర్వ్‌డ్ స్థానాలలో ఈసారి పోటీ ఎలా ఉండబోతుంది.. ఎవరెవరు గెలుస్తారు.. అన్నది చూస్తే ఇక్కడ పెద్దగా మార్పులు లేవు. పామర్రు లో గత ఎన్నికల్లో తల‌బడిన కైలే అనిల్ కుమార్, వర్ల కుమార్ రాజా మరోసారి పోటీ చేస్తున్నారు. నందిగామలోను మళ్ళీ పాత ప్రత్యర్థులు జగన్మోహన్‌రావు తంగిరాల సౌమ్య బరిలో ఉన్నారు. తిరువూరులో మాత్రం టీడీపీ, వైసీపీ అభ్యర్థులను మార్చాయి. వైసీపీ నుంచి అనూహ్యంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్‌కు టికెట్ దక్కింది. విజయవాడ టీడీపీ ఎంపీ కేసీనేని నాని పార్టీ మారడంతో.. ఆయనతోపాటు పార్టీ మారిన‌ స్వామిదాస్‌కు నాని పట్టు బ‌ట్టి టికెట్ ఇప్పించుకున్నారు.


టీడీపీ నుంచి గత ఎన్నికలలో మాజీమంత్రి జవహర్ పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత దేవదత్‌కు ఇంచార్జ్ పగ్గాలు అప్పగించారు. కట్ చేస్తే ఎన్నికలకు ముందు అనూహ్యంగా గుంటూరు జిల్లాకు చెందిన అమరావతి జేఏసీలో కీలకంగా వ్యవహరించిన కొలికిపూడి శ్రీనివాసరావుకు.. తిరువూరు టీడీపీ సీటు కేటాయించారు చంద్రబాబు. కృష్ణా జిల్లా టీడీపీకి కంచుకోట అయినా ఎందుకో గాని ఇక్కడ తిరువూరు, పామర్రులో టీడీపీకి పట్టు చిక్క‌టం లేదు. తిరువూరులో టీడీపీ గెలిచి 20 ఏళ్లు దాటిపోయింది. పామర్రు నియోజకవర్గం ఏర్పడి 15 సంవత్సరాలు అవుతున్న.. అసలు టీడీపీ జెండా ఎగరలేదు. చంద్రబాబు సైతం ఇక్కడ ప్రతి ఎన్నికకు అభ్యర్థులను మారుస్తూ వస్తుండడంతో పాటు.. పార్టీని పటిష్టం చేసే విషయంలో పెద్దగా దృష్టి పెట్టలేదు.


ఇది టీడీపీకి పామర్రు, తిరువూరులో పెద్ద మైనస్ అయింది. విచిత్రం ఏంటంటే కృష్ణాజిల్లాలో కూటమి ప్రభావం బలంగా ఉందన్న చర్చలు, అంచనాలు విన‌బడుతున్నా తిరువూరు, పామర్రు నియోజకవర్గాలలో మాత్రం టీడీపీ గెలుపు అంత ఈజీ కాదు అనే చెబుతున్నారు. నందిగామలో తెలుగుదేశంకు కాస్త ఆధిక్యత కనిపిస్తున్నా.. తిరువూరు, పామర్రు విషయంలో ఎవరూ గట్టిగా ఆ పార్టీ గెలుస్తుందని చెప్పలేని పరిస్థితి. ఎన్నికలకు మరో పది రోజుల సమయం ఉండడంతో.. అప్పటికి ఇక్కడ పరిస్థితులు ఎలా ? మారుతాయో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: