ఓ పక్క రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తూనే మరోపక్క అభిమానులు అలరించేందుకు సినిమాల్లోనూ నటిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అడవి తల్లితో ఆదివాసీలది విడదీయలేని బంధం. అలాంటి బంధాన్ని, వారి జీవన స్థితిగతుల్ని పాట రూపంలో మలిస్తే.. ఎంత అద్భుతంగా ఉంటుంది. అలాంటి ఓ పాటను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్వయంగా విన్నారు. ఆదివాసీల గళం నుంచి వచ్చిన పాటను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా షూటింగ్ అరకు లోయలో జరుగుతోంది. 

షూటింగ్ విరామంలో అక్కడకు వచ్చిన కొందరు ఆదివాసీలు అడవితల్లితో ముడిపడిన వారి జీవన విధానాన్ని పాట రూపంలో పవన్ కు వినిపించారు. ఆయన కూడా తీరిగ్గా కూర్చుని పాటను ఓపికగా విన్నారు. గురువారం తన ట్విట్టర్ లో వాళ్లు పాడిన ఆ పాట వీడియోను పోస్ట్ చేశారు.‘‘నిన్న వకీల్ సాబ్ సినిమా షూటింగ్ విరామంలో అరకు ఆదివాసీలు ఆంధ్ర-ఒరియా భాషలో వారి జీవన స్థితిగతులను వివరిస్తూ పాట పాడారు.

 ఆ పాటను వింటుంటే విభూతిభూషణ్ బందోపాధ్యాయ రచించిన ‘వనవాసి’ గుర్తుకు వచ్చింది’’ అని వ్యాఖ్య జోడించారు. ఆదివాసీల గురించి మరో పోస్ట్ నూ ఆయన ట్విట్టర్ లో పెట్టారు. జనసేన పోరాట యాత్రలో భాగంగా అరకు పర్యటనకు వెళ్లామని, అక్కడ ఆదివాసీల జీవన పరిస్థితులు చాలా బాధకలిగించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీల సంస్కృతిని రక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. వారి జీవనవిధానంలో మార్పులు తీసుకురావడానికి జనసేన, జనసైనికులు ఎల్లప్పుడూ వారికీ అండగా నిలుస్తారని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ విధంగా పవన్ సినిమాల్లో ఉన్నప్పటికీ తన సేవాభావాన్ని, సమాజ బాధ్యతను మరవకుండా కార్యకర్తలను సన్నద్ధం చేయడం పవన్ కే సాధ్యమని.. ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: