దసరా బుల్లోడు... ఈ పేరు వింటే చాలు... ఎవరికైనా ఊపు రావాల్సిందే... అప్పటికీ.. ఇప్పటికీ ఎప్పటికీ ఎవ్వర్‌ గ్రీనే..! అక్కినేని నటించిన ఈ మూవీ ఓ ట్రెండ్‌ సృష్టించింది. కలెక్షన్ల వర్షం కురిపించింది.  దసరాబుల్లోడు వచ్చి 50 ఏళ్లయిన సందర్భంగా ఓ రిపోర్ట్‌.

వాణిశ్రీ, అక్కినేని నాగేశ్వర రావు జంటగా నటించిన దసరా బుల్లోడు సినిమా 1971, జనవరి 13వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదలయ్యింది. కమర్షియల్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అప్పట్లోనే కోటిన్నర వసూళ్లు రాబట్టింది. అక్కినేని ఈ సినిమాలో ధరించిన చొక్కా ఓ ట్రేడ్ మార్క్‌గా మారింది.  

ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న జగపతి సంస్థల అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్‌ దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రమే దసరా బుల్లోడు. ఇక జగపతిసంస్థ ఆస్థాన కవి ఆత్రేయ. ఆయనకు కథ వినిపించారు వి.బి.రాజేంద్రప్రసాద్‌. అందమైన పల్లెటూరి మనసుల మధ్య సాగిన ప్రేమకథ ఇది. ఆత్రేయ రాసిన సన్నివేశాలన్నీ మనసును హత్తుకున్నాయి. చరణాల్లో పాటల మనస్తత్వాన్నే పొదిగాడు..

సంగీతపరంగా సినిమాని సూపర్‌ హిట్‌ చెయ్యాలని ఆత్రేయ, కె.వి.మహదేవన్‌ ఇద్దరూ కంకణం కట్టుకున్నారు. కోనసీమ అందాలు గోదావరమ్మ పరవళ్ళు బంగారు జలపాతాల్లాంటి ఇసుక తిన్నెలూ వయసులో ఉన్న పాత్రల ఉరవళ్ళూ... అన్నీ కలిసొచ్చాయి. ముఖ్యంగా అక్కినేని వాణిశ్రీపై చిత్రీకరించిన పాటలన్నీ సూపర్‌హిట్‌లే. కె.వి.మహదేవన్‌ పల్లె పదాలకు గొప్ప స్వరాలతో ప్రాణం పోశారు.

వి.బి.రాజేంద్రప్రసాద్‌ దర్శకుడిగా చేసిన తొలి చిత్రం అఖండ విజయం సాధించింది. ఎక్కడెక్కడి నుంచో  బళ్ళు కట్టుకొని పట్టణాల్లో ఈ సినిమా చూడ్డానికి వచ్చారు. ముఖ్యంగా అక్కినేనికీ వాణిశ్రీకీ స్టార్‌డమ్‌ తీసుకొచ్చిన చిత్రం దసరా బుల్లోడు. ఏ చిత్ర సీమలో అయినా ఎక్కువ పారితోషికం హీరోకే ఉంటుంది. అయితే ఈ చిత్రంలో పాత్రపరంగానే కాక అద్భుతమైన నటన కనబరిచిన వాణిశ్రీకి అక్కినేని కంటే ఎక్కువ రెమ్యునరేషన్‌ ఇచ్చారు. దసరా బుల్లోడు చిత్రం తర్వాత అక్కినేని, వాణిశ్రీ కాంబినేషన్‌ తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. శతదినోత్సవం చేసుకుంటుందనుకున్న ఈ చిత్రం అప్పట్లో ఏడాదిపాటు విజయవంతంగా ఆడింది.




మరింత సమాచారం తెలుసుకోండి: