
తాజాగా తన అప్‌కమింగ్ మూవీ 'థగ్ లైఫ్' గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మణిరత్నం, దీపికా డిమాండ్ నూటికి నూరు శాతం సరైనదేనని కుండబద్దలు కొట్టారు. "ఆమె ఒక తల్లి. తన బిడ్డ బాగోగులు చూసుకోవాలనుకుంటున్నప్పుడు, దానికి ఇబ్బంది లేకుండా ఉండేలా నిర్ణయాలు తీసుకోవడంలో తప్పేముంది?" అని ఆయన అన్నారు.
తన అవసరాల గురించి ఇంత ధైర్యంగా, క్లియర్‌గా చెప్పిన దీపికాను మణిరత్నం మెచ్చుకున్నారు. "మహిళలు తమకు ఏం కావాలో అడిగి, దాన్ని సాధించుకోవడం చాలా మంచి విషయం. ఇది ఒక ఆరోగ్యకరమైన మార్పుకు సంకేతం" అని ఆయన అభిప్రాయపడ్డారు.
కాగా, పరిమిత పని గంటలకే పట్టుబట్టిన దీపికాను 'అన్‌ప్రొఫెషనల్' అంటూ సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా విమర్శించినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు, దీపికా స్థానంలో, గతంలో తనతో 'యానిమల్' సినిమాలో పనిచేసిన త్రిప్తి దిమ్రిని తీసుకున్నారని కూడా రిపోర్ట్స్ వచ్చాయి.
ఇలాంటి రిక్వెస్ట్‌లను ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేయాలా అన్న ప్రశ్నకు మణిరత్నం 'కచ్చితంగా' అని బదులిచ్చారు. ఆయన ఇంకా వివరిస్తూ, "ఒకవేళ ఇలాంటి కోరిక మీ ప్రాజెక్ట్‌కు సెట్ అవ్వకపోతే, మీరు వేరే వాళ్లను చూసుకోవచ్చు. కానీ వాళ్ల అభ్యర్థనను గౌరవించాలి. ఇది చాలా అవసరమైన డిమాండ్. మనం దీన్ని యాక్సెప్ట్ చేసి, దానికి తగ్గట్టుగా పనిచేయడం నేర్చుకోవాలి" అని అన్నారు.
మణిరత్నం లాంటి దిగ్గజ దర్శకుడి సపోర్ట్, ఇప్పుడు బాలీవుడ్‌లో మెరుగైన పని పరిస్థితులపై, ముఖ్యంగా తల్లిదండ్రులైన నటీనటుల విషయంలో, ఓ పెద్ద చర్చకే దారి తీసింది. ఇప్పటికే చాలా మంది స్టార్స్ కూడా 8 గంటల షిఫ్ట్‌లకు జై కొడుతున్నారు.
ఇటీవల 'అరబ్ మీడియా సమ్మిట్ 2025'లో యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ మాట్లాడుతూ, "నేను ఇంటికి వెళ్లేసరికి నా పిల్లలు నిద్రపోవడం చూస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. 'లేదు, నేను ఇప్పుడు ఇంటికి వెళ్లి వాళ్లతో ఆ కాస్త సమయం గడపాలి' అని చెప్పగలగడమే అసలైన సక్సెస్" అని తన మనసులోని మాట చెప్పారు.
స్టార్ కపుల్స్ కాజోల్, అజయ్ దేవగణ్ కూడా ఈ ఐడియాకు మద్దతు పలికారు. అజయ్ దేవగణ్ మాట్లాడుతూ, "నిజాయితీగా సినిమా తీసే చాలా మంది దర్శక నిర్మాతలకు కొత్తగా తల్లైన వారి కోసం 8 గంటల షిఫ్ట్ పెట్టడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నిజానికి, ఇండస్ట్రీలో చాలా మంది ఇప్పటికే రోజుకు 8 గంటలే పనిచేస్తున్నారు. ఇది ఒక్కొక్కరినీ బట్టి ఉంటుంది, కానీ చాలా మంది అర్థం చేసుకుంటారు" అని అన్నారు.