
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మోస్ట్ అవైటెడ్ హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన "హరిహర వీరమల్లు" ఎట్టకేలకు భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రారంభంలో దర్శకుడు క్రిష్ ఈ ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టగా.. క్రిష్ తప్పుకోవడంతో చివరకు దర్శక బాధ్యతలు జ్యోతికృష్ణ భుజాన వేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం థియేటర్లలో విడుదలవ్వడం, ప్రేక్షకులను ఓ పీరియాడిక్ ప్రపంచంలోకి తీసుకెళ్లడంలో చాలా వరకూ విజయవంతమైంది.
చిత్రంలో పవన్ కళ్యాణ్ పోషించిన హరిహర వీరమల్లు పాత్ర ఓ రియల్ ఫైటర్ గాను, ధర్మాన్ని నిలబెట్టేందుకు పోరాడే యోధుడిగానూ చూపించబడింది. పవన్ నటనలో మునుపెన్నడూ చూడని కొత్త కోణాలు కనపడతాయి. యాక్షన్ నుంచి ఎమోషన్ వరకూ అన్ని షేడ్స్‌ను ఆయన చక్కగా ప్రదర్శించారు. అయితే, సినిమాలో ప్రేక్షకులు మాట్లాడుకుంటున్న అంశం మాత్రం పవన్ కళ్యాణ్ కాదు, మరొకరు.. ఆయనే సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి. సినిమా మొత్తం అతను ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మాస్ ఎలివేషన్ మూమెంట్స్‌లో వినిపించే థండరస్ మ్యూజిక్, క్లైమాక్స్ లో తీసుకెళ్లే భావోద్వేగ సంగీతం అన్నీ ప్రేక్షకుల హృదయాలను తాకాయి.
నిజానికి కీరవాణి నుంచి అంత మాస్ స్కోర్ వస్తుందని చాలా మంది ఊహించలేదు. కానీ ఈసారి ఆయన తనను తాను మించిపోయారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్స్, యుద్ధ సన్నివేశాలు, సనాతన ధర్మం కోసం జరిగిన పోరాటానికి కీరవాణి ఇచ్చిన సంగీత మద్దతు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈయన వర్క్ సినిమా విడుదలయ్యాక సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. “కీరవాణి మ్యూజిక్ లేకపోతే వీరమల్లు ఇంతగా కనెక్ట్ అయ్యేదా?” అనే ప్రశ్న చాలా మంది నెటిజన్ల నోటి నుంచి వినిపిస్తోంది. ఇక థియేటర్‌లో చూసిన ఫ్యాన్స్ అయితే – సీన్ కంటే ముందే బీజీఎం విన్నప్పుడే గూస్‌బంప్స్ వస్తున్నాయని చెబుతున్నారు. ఫస్టాఫ్‌లో ఆయా పాత్రలకు అందించిన థీమ్ మ్యూజిక్, సెకండాఫ్‌లో క్లైమాక్స్ యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్ – అన్నీ చాలా ఇంటెన్స్ గా ఉండటంతో ఆడియెన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు.