
ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాలలో నటించిన రామచంద్ర ప్రస్తుత పరిస్థితిని చూసి బడా హీరోలు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. కానీ ఇటీవలే హీరో మంచు మనోజ్ రామచంద్ర ఇంటికి వెళ్లి పరామర్శించి తన టీం నుంచి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తానంటూ ప్రకటించారు. ఇప్పుడు తాజాగా 'మనం సైతం' అనే ఫౌండేషన్ నిర్వాహకులు, టాలీవుడ్ కమెడియన్ కాదంబరి కిరణ్ .. నటుడు రామచంద్ర ను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. హైదరాబాదులోని రామచంద్ర నివాసానికి వెళ్లి 25వేల రూపాయల చెక్కును అందించారు. ఈ విషయం తెలిసి పలువురు నెటిజన్స్.. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించిన రామచంద్ర కు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు కానీ మీరు ఒక కమెడియన్ అయ్యుండి కూడా తోటి నటుడి పరిస్థితి అర్థం చేసుకొని సహాయం చేయడానికి ముందుకు రావడం నిజంగా ప్రశంసనీయమంటూ కమెడియన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఇప్పటికైనా హీరోలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రామచంద్ర కు ఆర్థికంగా సహాయపడతారేమో చూడాలి.
రామచంద్ర సుమారు వందకు పైగా చిత్రాలలో కమెడియన్ గా నటించారు . వెంకీ, ఆనందం, దుబాయ్ శీను, లౌక్యం తదితర సూపర్ హిట్ చిత్రాలలో కమెడియన్ గా నవ్వించారు. అయితే ఈమధ్య చాలామంది కొత్త వారు రావడంతో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. అలా ఒకవైపు అవకాశాలు తగ్గి ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్న సమయంలో పెరాలసిస్ సోకడంతో పూర్తిగా మంచానికే పరిమితం అయ్యారు. అయితే తనలో మాత్రం ఇంకా నటించే సామర్థ్యం ఉన్నదని.. ఎవరైనా సినిమా అవకాశాలు ఇస్తే నటిస్తానంటూ తెలియజేశారు.