ప్రస్తుతం ఎక్కడ చూసినా సినీ పరిశ్రమలో ఒకే ఒక విషయం చర్చనీయాంశంగా మారింది. అదే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే వివాదం. ఇటీవల కల్కి 2 మూవీ మేకర్స్ తీసుకున్న నిర్ణయం పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అవుతోంది. మొదట ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం దీపికా పదుకొనేను తీసుకున్నారు. కానీ అనూహ్యంగా ఆమెను ప్రాజెక్ట్ నుంచి తప్పించారు. దీంతో సోషల్ మీడియాలో వివిధ రకాల కామెంట్లు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇండస్ట్రీ వర్గాల్లో వస్తున్న టాక్ ప్రకారం, దీపికాను తొలగించడానికి కారణం ముఖ్యంగా కాల్ షీట్స్ డెఫిషియన్సీ అని మొదట వినిపించింది. అయితే చాలా మంది ఇది కేవలం ఒక కారణం చూపినట్టు మాత్రమేనని అంటున్నారు. అసలు కారణం వేరే ఉందని, ఆమెను కావాలనే తొక్కేయాలని, తెలుగు ఇండస్ట్రీలో ఆమె కెరీర్ కొనసాగకూడదని కొందరు నిర్ణయించుకున్నట్టుగా ఫీలవుతున్నారు. ఈ అనుమానాల వల్లే సోషల్ మీడియాలో ఇప్పుడు ఘాటు కామెంట్లు ఎక్కువయ్యాయి.


దీపికా పదుకొనే అంటే నిన్న మొన్నటి వరకు గ్లోబల్ స్టార్ గా  గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరోయిన్స్‌లో ఆమె ఒకరు. పెద్ద పెద్ద ఈవెంట్లలో, ప్రమోషన్లలో నిర్మాతలు, దర్శకులు, నటులు ఆమెను ఆకాశానికి ఎత్తేశారు. “దేవత” అంటూ పొగిడేశారు. తెలుగు స్టార్ హీరోలే స్వయంగా ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. కానీ ఇప్పుడు మాత్రం అదే ఇండస్ట్రీలో దీపికాను ఒక “దయ్యం” లా చూస్తున్నారనేది వాస్తవం. ఈ పరిణామాల వెనుక కారణం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న స్పిరిట్ సినిమా అనేది కూడా బలంగా వినిపిస్తున్న కామెంట్. ఆ సినిమా చుట్టూ వచ్చిన కొన్ని ఇష్యూలే దీపికా కెరీర్‌పై ప్రభావం చూపించాయని కొందరు విశ్లేషకులు అంటున్నారు.



ఇక దీపికా వివాదం వల్ల మరోసారి ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్స్ మధ్యలో ఉన్న అసమానతలు బయటకు వచ్చాయి. స్టార్ హీరోలకు 100 కోట్లు, 150 కోట్లు ఇస్తారు. వాళ్లు ఎలాంటి కండిషన్స్ పెట్టుకున్నా, ఎలాంటి సదుపాయాలు అడిగినా వెంటనే అమలు చేస్తారు. కానీ హీరోయిన్స్ మాత్రం కొన్ని కోరికలు లేదా హక్కులు డిమాండ్ చేస్తే, వెంటనే లిమిట్స్ పెట్టేస్తారు. ఎక్కువ రెమ్యూనరేషన్ అడిగితే లేదా సదుపాయాలు కోరితే “అతి చేస్తున్నారు” అంటూ సినిమాల నుంచే తప్పిస్తారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో చాలా మంది విమర్శిస్తున్నారు. “హీరోలు డిమాండ్ చేస్తే అది గొప్పగా ఫీలవుతారు.. హీరోయిన్స్ అడిగితే మాత్రం వాళ్లను తప్పిస్తారా? ఇది ఏ న్యాయం?” అంటూ ఘాటు కామెంట్స్  చేస్తున్నారు. దీపికా అభిమానులు కూడా బలంగా రియాక్ట్ అవుతున్నారు. ఈ టాపిక్ సోషల్ మీడియాలో వేడెక్కుతోంది.



ఇండస్ట్రీలో ఇలాంటి పరిణామాలు చూడటం ఇదే మొదటిసారి కాదు. కానీ దీపికా పదుకొనే స్థాయి లాంటి గ్లోబల్ స్టార్ హీరోయిన్‌తో ఇలా వ్యవహరించడం మాత్రం అందరినీ షాక్‌కు గురి చేసింది. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా ఈ ఇష్యూ ఇప్పుడు పెద్ద స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. మరికొన్ని రోజులు ఈ వివాదం ఇంకా పెద్దదిగా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: