కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది ప్రజలు తమ కుటుంబ సభ్యులు, ఆప్తులను కోల్పోతున్నారు. భారతదేశంలో ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా అనాధ పిల్లలు పెరిగిపోతున్నారు. మరోపక్క చేతికందిన పిల్లలను కోల్పోయి ఎందరో తల్లిదండ్రులు తీవ్ర నిరాశలో మునిగితేలుతున్నారు. కొందరు తమ కుటుంబ సభ్యుల ప్రాణాలు కోల్పోవడంతో పాటు లక్షల రూపాయలు ఆసుపత్రుల బిల్లులకే కట్టేసి రోడ్డున పడుతున్నారు. కొందరు తమ భాగస్వాములను కోల్పోతున్నారు. ఆక్సిజన్ అందక తమ కళ్లెదుటే తను కట్టుకున్న వాళ్లు చనిపోతుంటే వారి భాగస్వాముల ఆర్తనాదాలు కంటతడి పెట్టిస్తున్నాయి. కరోనా వైరస్ వల్ల పరోక్షంగా ఆర్థికంగా నష్టపోయే వారు కూడా కోకొల్లలు. చాలామంది కుటుంబ బాధ్యతలను మోయలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. తాజాగా ఒక ఎన్నారై కుటుంబంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఒక భర్త తన భార్య ఎదుటే ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచివేస్తోంది.  

పూర్తి వివరాలు తెలుసుకుంటే.. 42ఏళ్ల ఎన్నారై గత కొద్ది సంవత్సరాలుగా తన భార్యతో కలిసి దుబాయ్ లో జీవనం సాగిస్తున్నారు. ఆయన కుటుంబ పోషణ కోసం దుబాయ్ లోని ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే సంతోషంగా తన కుటుంబాన్ని పోషించుకుంటున్న సమయంలోనే అతనికి కరోనా వైరస్ సోకింది. దీంతో అక్కడి వైద్యులు అతని చేతికి క్వారెంటైన్ వ్రిస్ట్ బ్యాండ్‌ను తొడిగారు. దీనితో ఆయన గత 5 రోజులుగా ఐసోలేషన్‌లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. కరోనా సంక్రమించడం తో ఆయన ఉద్యోగానికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కుటుంబ పోషణ ఎలా అనే ఆలోచనలు అతని మరింత ఉక్కిరి బిక్కిరి చేశాయి. బాగా దిగులు పెట్టుకున్న ఆయన భవిష్యత్తులో అనేక ఆర్థిక పరిస్థితులు ఎదురవుతాయి ఏమో అని బాగా భయపడిపోయారు. చివరికి తాను ఈ బరువు బాధ్యతలు మోయ్యాలేనని.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

దీనితో గురువారం రోజు రాత్రి తన భార్యతో సహా అజ్మాన్ ప్రాంతంలోని అల్ రావ్డా బ్రిడ్జ్ వద్దకు కారులో చేరుకున్నారు. అనంతరం ఒక ఎత్తైన భవనం ఎక్కి 'పిల్లలను జాగ్రత్తగా చూసుకో' అని తన భార్యకు చెబుతూ హఠాత్తుగా కిందకి దూకేశారు. అయితే తన భార్య వద్దని ఎంత వారించినా ఆయన వినకుండా ఆమె కళ్ళ ముందే కిందకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఐతే భర్త చావును కళ్లారా చూసిన.. భార్య గుండెలవిసేలా కన్నీరుమున్నీరయ్యారు. కాగా, ఈ ఘటనపై స్థానిక పోలీసు అధికారులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: